తెలంగాణలో కులగణన పక్కాగా చేసినం : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణలో కులగణన పక్కాగా చేసినం : సీఎం రేవంత్​రెడ్డి
  • చట్టప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నం.. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్మొద్దు
  • కాంగ్రెస్​ బీసీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నేతలతో సీఎం రేవంత్​రెడ్డి
  • బీసీ లీడర్లంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలి
  • సర్వేలో తప్పు ఎక్కడుందో బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు చెప్పాలి
  • బట్ట కాల్చి మీద వేస్తామంటే సహించేది లేదు
  • బ్లాక్ వైజ్​​గా అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నయ్​.. కోర్టు సమస్యలు రాకుండా పకడ్బందీగా చేపట్టినం
  • కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ ఎందుకు వివరాలిస్తలే.. వాళ్లు జనాభా లెక్కల్లో లేరా?
  • రెండో విడత పూర్తి కాగానే కులగణన నివేదికకు చట్టబద్ధత కల్పిస్తం
  • బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : భవిష్యత్​లో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా పక్కాగా కులగణన చేపట్టామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఇందులో ఎక్కడ తప్పు ఉందో చెప్పాలని బీఆర్​ఎస్​, బీజేపీ నేతలకు సవాల్​ చేశారు. ‘‘ఎక్కడ తప్పుందో చూపెట్టాలని కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు, బండి సంజయ్​, కిషన్​రెడ్డికి సూటిగా సవాల్​ విసురుతున్న. ఉత్తగనే తప్పు తప్పు అని చెప్తే కుదరదు” అని అన్నారు. బీసీలకు ఫలాలు దక్కొద్దనే బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు కులగణనపై కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే సర్వేను బుట్టదాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

 ఎవరు అడ్డంపడినా బీసీల రిజర్వేషన్లను 42శాతం పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని  తేల్చిచెప్పారు. కులగణనపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని బీసీ నేతలకు ఆయన సూచించారు. కాంగ్రెస్​ బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్​ చైర్​పర్సన్లు, నేతలతో శనివారం ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి సీఎం రేవంత్​రెడ్డి సమావేశమయ్యారు.

కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల అభిప్రాయాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.  ‘‘ఇక్కడ చేసిన కులగణనతో ఎక్కడ వాళ్ల పదవులకు ఇబ్బంది వస్తదోనని తప్పుడు ప్రచారానికి తెరలేపిన్రు. అన్ని రాష్ట్రాలూ కులగణన చేయాలని డిమాండ్​ చేస్తే.. దేశమంతా అమలు చేయాల్సి వస్తదని బీజేపీ భయపడుతున్నది. అందుకే కుట్రలు పన్నుతున్నరు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మోదీ మాటలకు ఏం సమాధానం చెప్తవ్​ సంజయ్​?

జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్​ చేస్తూ ఈ మీటింగ్ లో తీర్మానం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గుజరాత్​ సీఎంగా ఉన్నప్పుడు మోదీ 70% ముస్లిం జాతులను బీసీల జాబితాలోకి తెచ్చారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారని రేవంత్ అన్నారు. అందుకు సంబంధించి మోదీ మాట్లాడిన వీడియోను చూపించారు. రాష్ట్రంలో ముస్లింలను బీసీల్లో చూపెడ్తే ఊరుకోబోమంటున్న బండి సంజయ్​.. మరి మోదీ చేసిన దానిపై ఏమంటారని, మోదీ మాటలకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. 

మోదీ బీసీల లెక్క వద్దంటున్నడు. అందుకే బండి సంజయ్​ కూడా వద్దంటున్నడు. ఈ కులగణన సర్వే రిపోర్ట్​ ఓకే అయితే బీసీలకు ఎక్కువ పదవులు వస్తాయనే బీఆర్​ఎస్ నేతలు అడ్డుపడుతున్నరు. పవర్​లోకి వచ్చిన ఏడాదిలోనే బీసీల కోసం ఇంత పెద్ద కార్యక్రమం చేపడితే మీదికెంచి విమర్శలు చేస్తరా? ఎవరు అడ్డంపడినా బీసీ రిజర్వేషన్లు 42శాతం పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తం” అని తేల్చిచెప్పారు.  

కేసీఆర్​, హరీశ్​, కేటీఆర్​ జనాభా లెక్కల్లో లేరా?

పారదర్శకంగా కులగణన చేపడితే కేసీఆర్ ఎందుకు వివరాలు ఇవ్వలేదని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. ‘‘గతంలో కేసీఆర్​ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి 51 బీసీలు, 21 శాతం ఓసీలు, 18 ఎస్సీలు, 10 ఎస్టీలు అని తేల్చిండు. మేం చేపట్టిన కులగణన లెక్కల్లో బీసీలు 56.33 శాతం ఉన్నారు. దీన్ని బట్టి బీసీల లెక్క తగ్గిందా.. పెరిగిందా.. సమాధానం చెప్పాలి? మేం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీలుగా ఐదు కేటగిరీలుగా లెక్కలు రిలీజ్ చేశాం. భవిష్యత్ లో కులగణన లెక్కలు గురించి  మాట్లాడితే, ఏదైనా చర్చ వస్తే.. తెలంగాణ గురించి మాట్లాడాల్సిందే” అని ఆయన తెలిపారు. కులగణన సర్వేలో వివరాలు ఇవ్వనివారికి మరో అవకాశంగా రెండో విడత సర్వే చేపడుతుంటే.. ఏదో తప్పు చేశారని కాబట్టి మళ్లీ సర్వే చేయిస్తున్నారని కొందరు కావాలని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. 

చట్టపరంగా ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్తుంటే బట్టకాల్చి మీద వేయడం ఏమిటని నిలదీశారు. ‘‘2వ విడత కూడా సర్వే చేస్తున్నం. కేసీఆర్, హరీశ్​రావు, కేటీఆర్ వివరాలు ఎందుకు ఇవ్వడంలేదు? అసలు వాళ్లు జనాభా లెక్కల్లోనే లేనట్లు అనుకోవాలి.  వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు ఇండ్ల ముందు డప్పులు కొట్టాలని బీసీ నేతలను కోరుతున్న” అని అన్నారు. ‘‘మంచి కార్యం కోసం పనిచేస్తున్న నన్ను విలన్ అంటున్నరు.. తప్పుడు ప్రచారం చేయిస్తూ ఫామ్​హౌస్ లో నిద్రపోతున్న వ్యక్తిని హీరో చేయాలనుకుంటున్నరు.

 కులగణన  లెక్కలపై అపోహలు ఉంటే పక్కన పెట్టండి. ఈ లెక్కలను కాపాడుకోక పోతే బీసీలకే నష్టం. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లెక్కల్లో తప్పు ఎక్కడుందో చూపెట్టాలని కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డిని డిమాండ్​ చేయాలి” అని బీసీ నేతలకు ఆయన సూచించారు. ‘‘సరైన సమాచారం లేక కొందరు తప్పుగా మాట్లాడుతున్నరు. 

ఎక్కడికక్కడ మీరు మౌనంగా ఉంటే 100 శాతం బీసీలకే నష్టం. ఇంత పకడ్బందీగా చేపట్టిన లెక్కలను కాపాడుకోవాలి. ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. రేపు రాహుల్​గాంధీని ప్రధాని చేసుకోవాలంటే కాంగ్రెస్​ కార్యకర్తలుగా మనకు ఒక కార్యాచరణ ఉండాలి. కులగణనపై ఫస్ట్​ డాక్యుమెంట్​ ఇది.  శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే కుల సర్వే ఇది. ఇందులో అన్ని కులాల లెక్క ఉంది. ఇది వందకు వంద శాతం పక్కాగా చేశాం. రెండో విడత పూర్తి కాగానే నివేదికకు చట్టబద్ధత కల్పిస్తం. అది ఫైనల్​ డాక్యుమెంట్​ అవుతుంది” అని నేతలతో ఆయన అన్నారు.  

కులాల వారీగా మీటింగ్ లు నిర్వహించండి

కులగణన లెక్కలపై కులాల వారీగా మీటింగ్ లు పెట్టాలని నేతలను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఎన్ని కులాలు ఉన్నాయో బాధ్యతలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల 10 వరకు మీటింగ్ లు పూర్తి చేయాలని సూచించారు. ఆరె కటిక కులం నుంచి మీటింగ్ స్టార్ట్ చేయాలని పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్​ను సీఎం కోరారు. కురుమ మీటింగ్ లు విప్ బీర్ల ఐలయ్య, ఎగ్గే మల్లేశం, సరితా తిరుపతయ్య.. ముదిరాజ్ మీటింగ్ బాధ్యతలు ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్​.. రజకుల మీటింగ్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  బాధ్యతలు తీసుకోవాలన్నారు. బీసీల్లో  104 కులాలు ఉన్నాయని, అందరూ మీటింగ్ లు నిర్వహించాలని సూచించారు. ఈ లెక్కలను అనాథలను చేయొద్దని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో  మీటింగ్ లు పెట్టి, మేధావులను పిలవాలన్నారు.  మిగతా విషయాల్లో తనను విభేదించినా, కులగణన విషయంలో తనకు మద్దతు పలకాలని సీఎం కోరారు. 

కావాలనే బీఆర్​ఎస్​, బీజేపీ రాద్ధాంతం : పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. కులగణనపై బీఆర్ఎస్, బీజేపీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. రాహుల్ గాంధీ  ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కులగణన సర్వేతో  దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచింది. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. 

కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ ఇండ్ల ముందు మేలుకొలుపు డప్పు : విప్ బీర్ల ఐలయ్య

కులగణనపై విసృతంగా ప్రచారం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం చెప్పారు. కులగణనలో రెండో విడత వివరాలు ఇచ్చేందుకు ఈ నెల 28 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ రావు ఇండ్ల ముందు మేలు కొలుపు పేరుతో డప్పులు కొడతాం. మీటింగ్​లో సీఎం అన్నికులాల నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.  

పరువు పోతదనే ఆ వివరాలు కేసీఆర్​ బయటపెట్టలే

గతం లో  కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ను 12 గంటల్లో ఆగమాగం చేశారని, కానీ ఆ లెక్కలన్నీ తప్పు కాబట్టే బయటపెట్టలేదని, కేవలం ఎన్నికల అవసరాల కోసం ఉపయోగించుకున్నారని సీఎం రేవంత్​ అన్నారు. “దేశంలో మరే రాష్ట్రంలో చేయనట్లుగా రాష్ట్రంలో కులగణన చేశాం. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ మెంబర్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. ప్లానింగ్ డిపార్ట్​మెంట్​కు నోడల్ ఏజెన్సీ గా సర్వే చేయించాం. కేసీఆర్​లాగా 12 గంటల్లో కాకుండా  మొత్తం ప్రభుత్వ  ఉద్యోగులు, అధికారులను రంగంలోకి దింపి,  రూ.160 కోట్లు ఖర్చు చేసి  50 రోజులపాటు కులగణన సర్వే చేశాం. 

భవిష్యత్​లో చట్టపరమై న సమస్యలు రాకుండా ప్రతి ఫ్యామిలీ రికార్డును ఫైల్​చేశాం. జాగ్రత్తగా ఆన్​లైన్​ చేయించడంతో పాటు బ్లాక్ వైస్  గా సేవ్​చేసి పెట్టాం” అని వివరించారు. ‘‘ఎస్సీ,  ఎస్టీ ఉప కులాలు 59 ఉంటే కేసీఆర్​చేసిన సర్వేలో  82 అని ఎంటర్ చేశారు . మోచి కులాన్ని  మోచి, మొచ్చి అని రెండు కులాలుగా లెక్కపెట్టారు. వాటిని బయటపెడితే పరువు పోతుందని కేసీఆర్ దాచిపెట్టారు. 

ఇప్పుడేమో కులగణనపై చెత్తవాగుడు వాగుతున్నారు. ఎక్కడ తేడా జరిగినా బీఆర్ ఎస్,  బీజేపీ కోర్టులో కేసులు వేస్తాయనే అత్యంత జాగ్రత్తగా కులగణన సర్వే నిర్వహించాం. సర్వేలో కోటి 12 లక్షలు కుటుంబాలు నమోదు చేసుకున్నాయి. కులగణనలో వివరాలు ఇవ్వని వారికి  ఈ నెల 16 నుంచి 28 వరకు మరో అవకాశం ఇచ్చాం. మన పార్టీలో కూడా లెక్కలు తప్పు అని కొంత మంది అవగాహన లేకుండా, బయట వాళ్ల చెప్పుడు మాటలు విని మాట్లడుతున్నరు. ఇది కరెక్ట్​ కాదు”  అని సీఎం అన్నారు. 

ఎవరు ఏ ప్రశ్న అడిగినా చెప్పేందుకు రెడీ : డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో బీసీ సర్వే విజయవంతం అయితే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందనే బీజేపీ నేతలు దుష్ప్రచారానికి దిగారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘‘బీసీ సర్వే అధికారికంగా జరగడం మూలంగా బీఆర్ఎస్ కు నష్టం.. కాబట్టే బీఆర్​ఎస్​ నేతలు కుట్రలు చేస్తున్నరు” అని అన్నారు. దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చామని,  దీన్ని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకువెళ్లాలనేది బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలని ఆయన కోరారు. సర్వేపై ఎవరు ఏ ప్రశ్న అడిగినా అధికారికంగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,  అన్ని ఆధారాలు అధికారికంగా నిక్షిప్తం చేశామని స్పష్టం చేశారు.

 ‘‘రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వరంలో కులగణన చేపట్టాం. సర్వే పారదర్శకంగా జరగాలని, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని, ఎక్కడ రాజీ పడొద్దని ప్లానింగ్ డిపార్ట్ మెంట్ చూస్తున్న నాకు  సీఎం స్పష్టంగా చెప్పారు” అని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందనే విషయం ప్రతి ఇంటికి ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.