రాజీవ్ స్వగృహ ఇళ్లకు వేలం.. డ‌బుల్ బెడ్రూం లబ్దిదారులకూ సీఎం రేవంత్ గుడ్ న్యూస్

రాజీవ్ స్వగృహ ఇళ్లకు వేలం.. డ‌బుల్ బెడ్రూం లబ్దిదారులకూ సీఎం రేవంత్ గుడ్ న్యూస్

హైద‌రాబాద్‌: రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఏళ్ల త‌ర‌బ‌డి వృథాగా ఉంచ‌డం స‌రికాద‌ని, వెంట‌నే వేలానికి రంగం సిద్ధం  చేయాల‌న్నారు. డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించ‌లేద‌ని సీఎం అధికారులను ప్రశ్నించారు. అర్హుల‌కు ఆ ఇళ్లను అప్పగించాలని ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, వాటిని అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్పగించాల‌ని సూచించారు.

ALSO READ | ఇక ఆపరేషన్​ మూసీ..ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ఇండ్ల కూల్చివేతలు

ద‌స‌రా పండుగ నాటికి ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ‌/ వార్డు, మండ‌ల/ పట్టణ, నియోజ‌క‌వర్గ, జిల్లా స్థాయి క‌మిటీల ఏర్పాటుకు విధివిధినాలు ఒక‌ట్రెండు రోజుల్లో రూపొందించాల‌ని సీఎం సూచించారు. అర్హుల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని సీఎం అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ బుధ‌వారం స‌మీక్ష నిర్వహించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న నుంచి ఇత‌ర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విష‌యంలో తెలంగాణ వెనుక‌బ‌డి ఉంద‌ని సీఎం చెప్పారు. ఈ ద‌ఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గ‌రిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ అధికారుల‌ను ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిలు రాబ‌ట్టాల‌ని సీఎం సూచించారు. 

ALSO READ | ఆపరేషన్ మూసీలో ముందుగా షెడ్లు,గోదాములు కూల్చివేత..

కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన స‌మాచారం వెంట‌నే ఇవ్వాల‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల విష‌యంలో డేటాను ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్ చేయాల‌ని సీఎం సూచించారు. పెద్ద సంఖ్యలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది స‌మ‌స్య ఎదుర‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికారులు తెల‌ప‌గా.. అవ‌స‌ర‌మైతే ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధతిన నియామ‌కాలు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, సీఎం స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యద‌ర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వి.పి.గౌత‌మ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.