సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ .. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్దాం : సీఎం రేవంత్

సంక్రాంతికి గేమ్ చేంజర్ స్కీమ్స్ .. కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్దాం :  సీఎం రేవంత్
  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్
  • నా పనితీరు మరింత మెరుగుపరుచుకుంటా.. మీరూ అలా చేయండి
  • ఏడాది పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు రెడీ అవుతున్నయ్ 
  • లోకల్ బాడీ ఎన్నికలు మనకు చాలా కీలకం.. నియోజకవర్గాల్లో తిరగండి 
  • కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించండి
  • త్వరలో పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలతో ముందుకెళ్దామని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇవాల్టి నుంచి నా పనితీరును ఇంకా మెరుగుపరుచుకుంటాను. మీరు కూడా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి’’ అని చెప్పారు. న్యూ ఇయర్​ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్లతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సంక్రాంతికి ప్రకటించనున్న కొత్త స్కీమ్స్ ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి గేమ్ చేంజర్​ కానున్నాయని ఆయన అన్నారు. ‘‘ఏడాది కాలంలో మన పనితీరు ఎలా ఉందనే దానిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అవుతున్నది. సీఎంగా నా పనితీరు ఎలా ఉందనే దానిపైనా రిపోర్టు తయారు చేస్తున్నాం. మీ రిపోర్టులతో పాటు నా రిపోర్టును కూడా త్వరలోనే మీ ముందు ఉంచుతాను” అని చెప్పారు.

నియోజకవర్గాల్లోనే ఉంటూ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మనకు కీలకం. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఇప్పటి నుంచే రంగంలోకి దిగాలి. అందుకే మీరంతా -హైదరాబాద్​ వీడి నియోజకవర్గాల్లోనే ఉండండి. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి. పోయినేడాది మనం అమలు చేసిన స్కీమ్స్ ను ఇంటింటికీ తీసుకెళ్లండి’’ అని దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనంలో ఉంటే.. పార్టీ కార్యకర్తలు కూడా అదే ఆదర్శంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్తారన్నారు. 

క్యాడర్​తో టచ్​లోకి వెళ్లాలి. పార్టీ నేతల మధ్య ఎక్కడైనా గ్రూపు తగాదాలు ఉంటే పరిష్కరించుకుంటూ సమన్వయంతో ముందుకుసాగాలి. లోకల్ బాడీ ఎన్నికల ద్వారా కొత్త రక్తాన్ని కాంగ్రెస్​లోకి తీసుకురావాలి. యువత, పార్టీ కోసం శ్రద్ధగా పని చేస్తున్నోళ్లను గుర్తించి టికెట్లు ఇవ్వాలి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసినోళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దు” అని ఆదేశించారు. ‘‘అందరూ మీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టండి. 

కార్యకర్తలకు ఎక్కువ సమయం కేటాయించండి. నేను కూడా పార్టీ నాయకులకు మరింత అందుబాటులో ఉంటూ, వారికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించేలా నా షెడ్యూల్ తయారు చేసుకుంటాను. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వన్ సైడ్ ఉండేలా చూడాలి. అందుకోసం అందరూ శ్రమించాలి” అని సూచించారు. కాంగ్రెస్ లోకి మున్ముందు మరిన్ని వలసలు ఉంటాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లతో విభేదాలు లేకుండా చూసుకోవాలన్నారు.

సీఎం నివాసంలో సందడి.. 

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో బుధవారం సందడి నెలకొంది. ఆయనను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, అధికారులు తరలివచ్చారు. వీరిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు,  సీఎంవో అధికారులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు.