భూమి లెక్క ఇక పక్కా: సీఎం చేతుల మీదుగా భూ భారతి పోర్టల్​ ఆవిష్కరణ

భూమి లెక్క ఇక పక్కా: సీఎం చేతుల మీదుగా భూ భారతి పోర్టల్​ ఆవిష్కరణ
  • భూ భారతితోరైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం
  • ప్రతి మనిషికి ఆధార్ లాగా ​ప్రతి ఒక్కరి భూమికీ భూధార్
  • వ్యవసాయ భూములను సర్వే చేసి హద్దులు తేలుస్తం
  • నాలుగు మండలాల్లో పైలెట్​ 
  • ప్రాజెక్ట్​ ద్వారా సమస్యల గుర్తింపు
  • రాష్ట్ర ప్రజలకు ధరణి ఒక పీడకల
  • గత పాలకుల లబ్ధి కోసమే రెవెన్యూ వాళ్లపై దోపిడీదారులుగా ముద్ర
  • చట్టాలను చుట్టాల్లా మార్చుకొని వేలాది ఎకరాలు దోచుకున్నరు
  • ఒక ఎలుక దూరిందని ఇల్లు తగలపెట్టుకోవాల్నా? 
  • అవినీతికి తాము వ్యతిరేకమని, రెవెన్యూ వ్యవస్థకు కాదని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: భూ భారతి పోర్టల్ ​ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పజెప్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  ‘‘మనిషికి ఆధార్ ఎట్లనో.. ప్రతి ఒక్కరి భూమికీ  భూధార్ తెస్తం. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి, హద్దులు గీసి రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడ్తం’’ అని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించడం పెద్ద సమస్య కాదని, రాబోయే రోజుల్లో వివాదరహిత భూ విధానం ఉండేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూ భారతి పోర్టల్‌ను హైదరాబాద్​ శిల్పకళా వేదికలో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్​ రెడ్డి  ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “ఇంటి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో, వ్యవసాయ భూములకు కూడా అలాంటి సిస్టమ్ తెస్తం. రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ రాకుండా చూస్తం” అని తెలిపారు. కొంతమంది దురుద్దేశంతో  రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత  ఆ శాఖ సిబ్బంది  మీద ఉందన్నారు. ఏ తప్పు చేయొద్దని.. చట్టాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. 

రెవెన్యూ సిబ్బంది వస్తే రైతులు భోజనం పెట్టి.. రైతు బాంధవులు వచ్చారని గౌరవం ఇచ్చే విధంగా పనిచేయాలన్నారు. “ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ప్రజాదర్బార్‌‌లు, సదస్సుల ద్వారా సమస్యలను తెలుసుకుని, శాశ్వతంగా పరిష్కరించి, వివాదరహిత భూ విధానంతో ముందుకు వెళ్తాం’’ అని సీఎం రేవంత్​ స్పష్టం చేశారు.

రెవెన్యూ సిబ్బంది లేకుండా రాష్ట్రం వచ్చేదా?

తెలంగాణ ప్రజలకు ధరణి పోర్టల్ ఒక పీడకలలా మారిందని, దాన్ని బంగాళాఖాతంలో కలిపి, భూ భారతి చట్టంతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  “గత ప్రభుత్వం తెచ్చిన ధరణి తెలంగాణ రైతులకు శాపంగా మారింది. నాడు ఒక తహసీల్దార్‌‌పై పెట్రోల్ పోసి తగలపెట్టే పరిస్థితి వచ్చింది. ఇబ్రహీంపట్నంలో జంట హత్యలు, సిరిసిల్లలో ఓ మహిళ తన తాళిబొట్టుతో భూమి హక్కు కోరిన ఘటనలు ధరణి భూతం వల్లే జరిగాయి. వీటిలో గత పాలకులు రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపించారు. 

ఈ క్రమంలో చట్టాలను కొంతమందికి చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టిన మాట వాస్తవం కదా”అని ఆయన ప్రశ్నించారు. “నాలుగైదు దశాబ్దాలుగా రెవెన్యూ సిబ్బంది భూముల వివరాలను భద్రంగా నమోదు చేశారు. పటేల్​ పట్వారీ వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ, వీఆర్వో, వీఆర్ఏల వరకు రికార్డులను అందుబాటులో ఉంచారు. కానీ.. ధరణి తెచ్చి రెవెన్యూ సిబ్బందిని దోషులుగా, దొంగలుగా కొందరు చిత్రీకరించారు. 

ఒక ఎలుక దూరిందని ఇల్లు తగలపెట్టుకోవాల్నా?” అని అన్నారు. ‘‘రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా దోషులుగా చూపే విధానానికి నేను వ్యతిరేకం. గతంలో కేసీఆర్ అసెంబ్లీలో రెవెన్యూ సిబ్బందిని తప్పుబట్టారు. మంచి జరిగితే తమది, చెడు జరిగితే సిబ్బందిదని చెప్పడం సరికాదు. రెవెన్యూ సిబ్బంది లేకుండా రాష్ట్రం వచ్చేదా ? ఎన్నికలు జరిగేవా?  అసలు ప్రభుత్వం నడుస్తదా ?’’ అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. 

ప్రజల దగ్గరికే ఆఫీసర్లు: పొంగులేటి 

గత ప్రభుత్వ హయాంలో రూపొందిన 2020 రెవెన్యూ చట్టం (ధరణి) ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.  “ధరణి నలుగురు కలిసి రహస్యంగా రూపొందించిన చట్టం. ఇది రైతుల జీవితాలను గందరగోళంలోకి నెట్టింది. స్వార్థ ప్రయోజనాల కోసం గ్రామ పరిపాలన వ్యవస్థను కూడా రద్దు చేశారు” అని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఎంతో కృషి చేసి భూ భారతి చట్టాన్ని రూపొందించారని చెప్పారు. అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీఆర్‌‌ఎస్ సభ్యులు అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని.. అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. 

2020 రెవెన్యూ చట్టం మూడేండ్లలో మునిగిపోగా, భూ భారతి చట్టం వందేండ్లు వర్ధిల్లుతుందన్నారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు ఖమ్మం, మహబూబ్‌‌నగర్, ములుగు, కామారెడ్డి జిల్లాల్లోని నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్ట్‌‌గా ఎంపిక చేసినట్లు వివరించారు. “ప్రజల వద్దకు అధికారులు వెళ్లి సమస్యలను స్వీకరించి, 15 రోజుల్లో పరిష్కరిస్తారు. ఈ నెల 17 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తాం” అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.  అన్నివర్గాల నుంచి ఫీడ్‌‌బ్యాక్ తీసుకుని, అవసరమైన మార్పులతో జూన్ 2 నాటికి సమగ్ర చట్టాన్ని అమల్లోకి తెస్తామన్నారు. 

మే మొదటి వారంలో మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి, సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకు ఎమ్మార్వో స్థాయిలో అధికారుల బృందం పని చేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. సామాన్యులకు చట్టాలు అనుకూలంగా ఉండాలన్న అంబేద్కర్​ ఆలోచన స్పూర్తితో భూ భారతి చట్టం రూల్స్​, పోర్టల్​ ప్రారంభించుకోవడం సంతోషమకరమని సీఎస్​ శాంతి కుమారి పేర్కొన్నారు. నాలుగు స్తంభాలతో పటిష్టంగా ఉండేలా భూ భారతిని తెచ్చామని రెవెన్యూ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​ తెలిపారు. 

‘‘ఒకటి చట్టం, రెండోది రూల్స్​, మూడోది రెవెన్యూ యంత్రాంగం బలోపేతం, నాలుగోది ఇంప్రూవ్డ్​ వెబ్​ పోర్టల్” అని పేర్కొన్నారు. త్వరలోనే ఇంకో కొత్త పోర్టల్​ను కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. సమావేశంలో శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

అసైన్డ్​ కమిటీల సమావేశాలు పెడ్తం: భట్టి 

భూ భారతి చట్టం సామాన్యుడికి అర్థమయ్యేలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత పాలకులు 10  ఏండ్లలో అసైన్డ్ కమిటీల సమావేశాలు పెట్టకుండా, ఒక్క గజం భూమి కూడా పంచలేదని ఆయన తెలిపారు. భూ భారతి ద్వారా అసైన్డ్ కమిటీలను పునరుద్ధరించి, అర్హులైన పేదలకు పట్టాలు పంచుతామని హామీ ఇచ్చారు.  భూమికి మనిషికి విడదీయలేని బంధం ఉందని, రైతులు పోరాటాల ద్వారా సాధించిన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం రైతుల జీవితాలను అల్లకల్లోలం చేసిందని పేర్కొన్నారు.

“ధరణి రైతులకు శాపంగా మారింది. కొందరు పెత్తందారుల కోసం రైతుల హక్కులను తాకట్టు పెట్టింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన 24 లక్షల ఎకరాల భూమి హక్కులను ధరణి నాశనం చేసింది” అని భట్టి అన్నారు.  2023లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రైతులు తమ గోడు వెల్లడించారని ఆయన గుర్తు చేశారు. “రైతులు ధరణి వల్ల భూమి హక్కులు కోల్పోయామని, కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని చెప్పారు. 

అప్పుడే హామీ ఇచ్చాం.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామనీ” అని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పటి పీసీసీ చీఫ్‌‌గా రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో ధరణిని తొలగిస్తామని, ప్రజలకు మేలు చేసే చట్టం తెస్తామని చెప్పారని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చలు జరిపి, రైతులకు హక్కులు కల్పించే భూభారతి చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి,  ఇప్పుడు తెలంగాణ రైతులకు అంకితం చేశామన్నారు. భూ భారతి చట్టం రైతులకు న్యాయం చేయడానికి రూపొందిందని, దీనిపై ప్రజలకు కలెక్టర్ల నుంచి రెవెన్యూ అధికారుల వరకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. “ప్రజల్లో ఈ చట్టం మన కోసమేనని నమ్మకం కలిగించాలి” అని తెలిపారు. 

ధరణిని బంగాళాఖాతంలో కలిపినం

తాను కానీ, డిప్యూటీ సీఎం కానీ నాడు పాదయాత్ర చేసినప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన పోడు భూములు, అసైన్డ్​ భూములు, సొంతంగా కొనుకున్న భూములు భూ యాజమానులకు కాకుండా పోతున్నాయని.. ధరణిని మార్చాలని ఎంత  చెప్పినా వాళ్ల (బీఆర్​ఎస్​ నేతల) చెవికి ఎక్కలేదని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘మా ప్రభుత్వం వస్తుంది.. ధరణిని, దాని కోసం బీఆర్​ఎస్​ సర్కార్​ చేసిన చట్టాన్ని బంగాళాఖాతంలో విసురుతామని అప్పట్లో చెప్పాం. కొత్తగా చేసే చట్టం ప్రజలకు చుట్టంగా ఉండాలని భావించి ఆ దిశగా పనిచేశాం. భూసమస్యలకు భూ భారతి శాశ్వత పరిష్కారాలు చూపిస్తుంది” అని పేర్కొన్నారు. 

“కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్‌‌తో పాటు పలువురి సలహాలు, ఇతర రాష్ట్రాల అధ్యయనంతో సమగ్రంగా భూ భారతి చట్టాన్ని రూపొందించాం. ముందుగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌‌గా అవగాహన సదస్సులు మొదలుపెడుతున్నాం. అక్కడ రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్లి రైతుల విజ్ఞప్తులు స్వీకరించి, సమస్యలను పరిష్కరిస్తారు. ఈ ఫీడ్‌‌బ్యాక్‌‌తో ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం” అని సీఎం వివరించారు. “తెలంగాణలో వందల ఏండ్లుగా భూమి కోసం పోరాటాలు జరిగాయి. కొమురం భీం ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య నిజాం పాలనకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టులు ‘దున్నేవాడిదే భూమి’ అని పోరాటాలు చేశారు. 

ఈ స్ఫూర్తితోనే ఇందిరాగాంధీ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవంతో ఉండాలని భూములు కేటాయించారు. భూభారతి కూడా అదే లక్ష్యంతో రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తుంది” అని తెలిపారు. ‘‘ఖమ్మం పాలేరులో లక్ష మందితో బహిరంగ సభ పెట్టి భూ భారతి పోర్టల్​ లాంచ్​ చేద్దామని పొంగులేటి అన్నరు. 

అయితే చట్టాన్ని అమలు చేయాల్సిన రెవెన్యూ సిబ్బందితో ప్రారంభించాలని చెప్పిన. పొంగులేటి, భట్టి,  తుమ్మల కలిస్తే 5- లక్షల నుంచి 6 లక్షల మందితో  అయినా సభ పెట్టొచ్చు. కానీ,  చట్టం ప్రజలకు తెలియజేసేందుకు పోర్టల్​ ప్రారంభోత్సవానికి అతిథులుగా రెవెన్యూ సిబ్బంది ఉండాలని చెప్పి ఇలా నిర్వహిస్తున్నం”అని రేవంత్ వివరించారు.