- కేటీఆర్, హరీశ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- జన్వాడలో కేటీఆర్, అజీజ్‌నగర్‌లో హరీశ్ అక్రమ ఫామ్‌హౌస్‌లు కూల్చొద్దా?
- సబితమ్మ ముగ్గురు కొడుకుల మూడు ఫామ్‌హౌస్‌ల సంగతేంది?
- వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నరు
- నాలాలు, మూసీలో ప్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్లు
- పేదలు ఎప్పుడూ మూసీ మురికిలోనే బతకాల్నా?.. వాళ్ల బతుకులు మారొద్దా?
- వాళ్లకు మంచి ఇండ్లు ఇవ్వడం.. తొవ్వ ఖర్చులకు 25 వేలు ఇవ్వడం నేరమా?
- మూసీపై అఖిలపక్షాన్ని పిలుస్తం.. చేతనైతే వచ్చి సూచనలు చేయండి
- మోదీ సబర్మతీ రివర్ ఫ్రంట్ కట్టొచ్చు గానీ.. ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ వద్దా?
- ప్రధాని దగ్గరికి పోయి పేదలకు పాతిక వేల కోట్లు తేవాలని ఈటలకు సవాల్
- ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: అక్రమంగా కట్టుకున్న ఫామ్‌హౌస్‌లను కాపాడుకోవడానికే మూసీని ముందట పెట్టి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మూసీపై అఖిలపక్షాన్ని పిలుస్తామని.. పేదలకు ఏం చేయాలో చేతనైతే వచ్చి సూచనలు ఇవ్వాలని సవాల్ చేశారు.
‘‘బఫర్ జోన్లు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్లు. ఇప్పుడు ఎక్కడ మధ్యతరగతి ప్రజలు తిరగబడ్తరోనని భయపడి.. కొందర్ని ఉసిగొల్పి ధర్నాలకు, నిరసనలకు దిగుతున్నరు. కూల్చివేతలు ఆపితే సంచులు వస్తాయని.. కూల్చేస్తే తిట్లు పడుతాయని నాకు తెల్వదా? సంచులు తీసుకున్నోళ్లే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు” అని బీఆర్ఎస్ నేతలపై సీఎం సీరియస్ అయ్యారు.
పేద ప్రజలకు సంక్షేమం అమలు చేయడమే తమ బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. ‘‘మూసీ ఏరియాలో జనం ఆ కంపు, ఆ కలుషితంతో ఎన్నాళ్లు తిప్పలు పడాలి? వాళ్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి, వాళ్లకు పని కల్పించి.. వాళ్ల పిల్లలు చదువుకోనికి మేం ఏర్పాట్లు చేస్తుంటే.. కేటీఆర్, హరీశ్‌రావుకు నొప్పేంది? ఈటల రాజేందర్‌కు దుఃఖం ఏంది ? ఏంది వీళ్ల బాధ. మూసీ ఏరియాలోని జనం కంపులోనే బతకాల్నా? మంచిగా బతుకొద్దా? వాళ్లు ఎప్పటికీ మూసీలోనే ఉండాల్నా? వాళ్ల పేదరికం చూపించి మీరు ఓట్లు వేసుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతరా? ఇల్లు లేని పేదవానికి ఇల్లు ఇవ్వడం నేరమా? వాళ్ల బిడ్డలకు చదువు చెప్పించడం నేరమా? వాళ్ల ఇండ్లు తరలించడానికి తొవ్వ ఖర్చులకు రూ.25 వేలు ఇవ్వడం నేరమా?” అని ప్రశ్నించారు. మన పిల్లలకు, వాళ్ల పిల్లలకు హైదరాబాద్ నగరాన్ని మంచి నగరంగా అందించాలనే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.
‘‘ఏ పేదవాడి కన్నీళ్లు మేం చూడ దలుచుకోలేదు.. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నేదే మా ఆలోచన” అని వెల్లడించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని గురువారం సికింద్రాబాద్ సిక్ విలేజీలోని హాకీ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ‘‘మా ఇండ్లు కూలగొట్టొదని ముసుగు తొడగడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు మీరు. ఎంతకాలం తప్పించుకుంటారు. వారం రోజులు, పది రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల. మీ భరతం పడతా. ఒక్కొక్కరిని చింతపండు చేస్తా” అని ప్రతిపక్షాలను హెచ్చరించారు.
మీ ఫామ్‌హౌస్‌లు కూలగొట్టల్నా వద్దా ?
‘‘మేము అధికారంలోకి వచ్చి పది నెలలు కాలేదు. పదేండ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన మీరు ఆగర్భ శ్రీమంతులు ఎట్ల అయ్యారు?” అని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఫామ్‌హౌస్‌లను కాపాడుకోవడానికే కదా ఇయ్యాల ముసుగు తొడుక్కొని.. పేదోళ్లను రక్షణ కవచంగా పెట్టి కూలగొట్టొద్దని అంటున్నరు. ఇయ్యాల ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్.. జన్వాడలో నీకున్న ఫామ్‌హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టల్నా వద్దా.. చెప్పు. హరీశ్‌రావు అజీజ్‌నగర్‌లో ఉన్న ఫామ్‌హౌస్ అక్రమమా ? కాదా ? దాన్ని కూలగొట్టల్నా వద్దా.. చెప్పు. సబితమ్మ నీ కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్‌హౌస్‌లు కట్టినవు కదా? మీకున్న ఫామ్‌హౌస్‌లకు కూడా లెక్కలున్నయ్.
మీకు వెనకంగా ఉన్న కేవీపీ రాంచందర్ రావువి కూడా కూలగొట్టల్నా? వద్దా.. చెప్పు. అక్రమంగా ఫామ్‌హౌజ్‌లను కట్టుకొని.. ఆ ఫామ్‌హౌస్‌లు ఎక్కడ కూలుతాయో అని పేదలను రక్షణ కవచంగా పెట్టుకుని మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ఫ్లాట్లు వేసి అమ్మినోడు మీ పార్టీ వాడు కాదా? మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి రూ.10 లక్షలకు వంద గజాల చొప్పున అమ్మింది మీ సన్నాసులు బీఆర్ఎస్ నాయకులు కాదా? సున్నం చెరువులో, మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మి.. ఇయ్యాల ప్రభుత్వ భూమి అని తేలంగానే ఎక్కడ చొక్కా పట్టుకుని మా పైసలు మాకు ఇవ్వాలని అడుగుతారోనని చెప్పి కొందరిని ఉసిగొల్పి ధర్నాలకు, దీక్షలకు దిగుతున్నరు. మూసీలో వచ్చిన వరదలు తెలంగాణను, హైదరాబాద్ సిటీని ముంచేస్తలేవా? వాటికి పరిష్కారం చూపొద్దా” అని నిలదీశారు.
హైడ్రాపై చర్చ పెడ్తే పారిపోయిన్రు
హైదరాబాద్‌ను వరద నుంచి, బురద నుంచి కాపాడాలని ఆలోచనతో ముందుకు వస్తే దానిమీద కూడా బురద జల్లుకుంటా బావబామ్మర్ధులు తిరుగుతున్నారని హరీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ‘‘కొందరు కిరాయి మనుషులతో మీరు చేసే హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇయ్యాల పేదలకు అన్యాయం అయిందని ఏడుస్తున్నరు కదా..! ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అందులోంచి రూ. 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయినోళ్లకు పంచిపెట్టండి. అధికారంలోకి రాకముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా మీకు. ఇప్పుడు ఎట్ల కోట్లకు కోట్లు వచ్చినయ్? మూసీ వాళ్లకు ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి. వినడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయారు. మాట్లాడలేదు.
హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ? ఇప్పటికైనా పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్మో.. మా తాత సొమ్మో ఇచ్చేది లేదు కదా. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవ్వాలి. మూసీ ఏరియాలోని వాళ్లకు 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని ఆదేశాలు ఇచ్చాను. మూసీ మురికిలో దోమలతో, కలుషితమైన నీళ్లతో అక్కడ బతకలేని శవాలుగా, జీవాచ్చవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బతకడానికి ఇళ్లు ఇచ్చి.. ఇంటి ఖర్చులకు రూ.25 వేలు ఇచ్చి మా అధికారులు వాళ్లను మంచి ఏరియాలో డబుల్ బెడ్రూం ఇండ్ల దగ్గర దిగబెడుతుంటే అన్యాయంగా మాట్లాడుతున్నారు” అని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే రావాలని, అఖిలపక్ష సమావేశం పిలుస్తామని, వచ్చి ఏం చేయాలో చెప్పాలని సూచించారు.
ఈటల..! మోదీ దగ్గరికి పోయి పాతిక వేల కోట్లు తెద్దమా?
మూసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ కు లేదా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘‘ఎంపీగ గెలిచినవు కదా.. మోదీ దగ్గర నుంచి ఏం తెస్తవో తీసుకరా? గుజరాత్ అహ్మదాబాద్ లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ మోదీ కట్టుకోవచ్చు గానీ.. మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణల కట్టొద్దట.. ఎంత అన్యాయం ఇది.. ఇక్కడున్న ప్రజలు కాదు.. నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే. నువ్వు బతకనీకి వచ్చినవ్.. ఓట్లేయించుకున్నవ్.. ఎంపీ అయినవ్.. కానీ వాళ్లు మాత్రం అదే మురికి కూపంలో ఉండాల్నా? వాళ్లందరిని చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా?” అని ఈటలను నిలదీశారు. ఇద్దరం కలిసి మోదీ దగ్గరకు పోదామని, మూసీ ప్రజల కోసం ఓ పాతిక వేల కోట్లు తీసుకువద్దామని, మంచి కాలనీల ఇండ్లు కట్టిద్దామని సవాల్ చేశారు.
కేటీఆర్, హరీశ్ రావు మొదటిరోజు మాట్లాడగానే.. తెల్లారి ఆ జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడుతారని ఆయన విమర్శించారు. ‘‘ఏందయ్యా మీ బాగోతం... అందరికీ అర్థమైతలేదా? పదేండ్లు నువ్వు వాళ్లతో మంత్రిగ ఉండి ఏం వెలుగబెట్టినవో తెలంగాణ సమాజం గమనిస్తలేదా? గౌరవం పెంచుకోండి రాజేందర్. మిమ్మల్ని గౌరవించాలనే మేం అనుకుంటున్నం. కానీ మీకు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీరు పార్టీ మారిండ్రు. కానీ మీకు పాత వాసన మాత్రం పోవట్లేదు.. ఆ గత్తర వాసన అట్లనే మీతోని కొడుతుంది” అని ఎద్దేవా చేశారు.
ఇంకుడు గుంత లేకుంటే ఇంటి పర్మిషన్‌కు నో
చెరువులను దురాశపరులు ఆక్రమించుకోవడంతో చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు వీధుల్లోకి వచ్చి.. వీధుల్లో నుంచి ఇండ్లలోకి వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొంతమంది అక్కడ నిర్మాణాలు చేసుకోవడం వల్ల వేలాది కాలనీల్లో ఉండే లక్షలాది ఇండ్లు నీటమునుగుతున్నాయ తెలిపారు. దీనికొక పరిష్కారం చూపించాలన్నారు. ‘‘ఎవరో ఒకరు నడుం బిగించాలి. నాకేందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. చూస్తుంటే చూస్తుంటేనే చెరువులు మూసుకుపోయినయ్. నాలాలు ముసుకుపోయినయ్. ఇంకా కొంతకాలం చూస్తే మూసీ కూడా మూసుకుపోతుంది. ఇవన్నీ మూసుకుపోయాక వర్షాలు, వరదలు వచ్చేది మన ఇండ్లలోకే. ఆరోజు కాపాడటానికి, అయ్యో పాపం అనడానికి కూడా మనిషి మిగలడు. రాజకీయాల్లో లోతు తెల్వక కాదు. మన పిల్లలకు, వాళ్ల పిల్లలకు ఈ నగరాన్ని మంచి నగరంగా అందించాలంటే ఎవరో ఒకరు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను తొలగించాలి” అని సీఎం చెప్పారు. ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడుతుండేదని, ఇప్పుడు 1,200 ఫీట్లు వేసిన బోరు పడతలేదని తెలిపారు.
ఇంకుడు గుంతలతో ఎన్ని ఇండ్లు ఉన్నాయని ప్రశ్నించారు. ఇంకుండు గుంతలు కట్టని ఇండ్లకు అనుమతులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ రెండింతలు చార్జ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. ‘‘గత సర్కార్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేసినా జనం కోసం ఏమీ చేయలే. నగరాన్ని కాపాడుకోవాలంటే.. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలంటే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే. కాల్వల్లో, నాలాలా ఆక్రమణలు తొలగించాల్సిందే. మూసీలో అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే. దానికి ఇంకా ఏం చేయాలో చెప్పండి” అని అడిగారు.
మీకోసం ఎన్ని బుల్డోజర్లు కొనాలె
‘‘ప్రతి ఒక్కరు బుల్డోజర్ నామీదకెళ్లి పోవాలి అంటున్నరు. మీ కోసం ఎన్ని బుల్డోజర్లు కొనాలి. హరీశ్‌కు ఒకటి, కేటీఆర్‌కు ఒకటి.. అప్పులు చేసి పోయిండు కేసీఆర్. అన్ని బుల్డోజర్లు కొనే పైసలు లేకుండా చేసిన్రు. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారినపోయే పిచ్చికుక్క కరిస్తే కూడా చస్తరు. మీ గురించి ఆలోచన చేయాల్సిన అవ సరం ఉందా ?” అని సీఎం దుయ్యబట్టారు. రాజకీయం కోసం మూసీ ప్రాజెక్టు చేపట్టలేదని తెలిపారు. “ప్రాజెక్టును ఆపితే శ్రీమంతులంతా వచ్చి సంచులు ఇస్తరు. అడ్డుపడానికి సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి.
తొలగిస్తే సంచులు ఎవరిస్తరు ? తొలగిస్తే తిట్లు వస్తయ్. తిట్ల కోసం చేస్తున్ననా? రాబోయే తరాల కోసం ఈ మంచి పనిచేస్తున్నం” అని వివరించారు. ఇంతవరకు మూసీ ప్రాజెక్టుకు అంచనాలు వేయలేదని.. లక్షల కోట్లు అంటూ బీఆర్ఎస్ నేతలు రాగం ఎత్తుకున్నారని మండిపడ్డారు. ‘‘లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి.. వాళ్ల హయాంలోనే కూలిపోయింది. ఇట్ల కట్టినోళ్ల హయాంలోనే కూలిన ప్రాజెక్టు ఎక్కడైనా ఉందా? అదీ బీఆర్ఎస్ ఘనకార్యం. పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్క తోక తగిలి కూలిందట.. అట్లుంది కాళేశ్వరం ముచ్చట. మూసీలో అలాంటివి ఉండవు. సొంత మీడియా, సోషల్ మీడియా ఉందని ఏది పడితే అది బీఆర్ఎస్ నేతలు మాట్లాడ్తున్నరు” అని ఆయన ఫైర్ అయ్యారు.
ఇండ్లు పోతే ఎట్లుంటదో ఆ బాధ నాకూ తెలుసు
‘‘ఇవ్వాల కొంతమంది పేదల ఇండ్లు తీసేస్తే వాళ్లకు దు:ఖం ఉంటది. వాళ్లకు బాధ ఉంటది. వాళ్లు కొంత ఆవేశంగా మాట్లాడుతరు కావచ్చు. వాళ్ల బాధ నాకూ తెలుసు. 20 ఏండ్లు ప్రజా క్షేత్రంలో ఉన్నోన్ని. ప్రజలల్ల తిరిగినోన్ని.
పేద ప్రజల కష్టం తెల్వకుండానే ముఖ్యమంత్రిని అయ్యిన్నా. కానీ ఈ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? ఆలోచన చేయండి. హైదరాబాద్‌కు తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో బలిసినోళ్ల ఇండ్ల నుంచి డ్రైనేజీ తీసుకెళ్లి వాటిలో కలిపితే వాళ్ల డ్రైనేజీ నీళ్లు హైదరాబాద్ నగరం తాగల్నట? వాళ్లకు ఒకటే చెప్తున్న.. ఆ జంటజలశయాల చుట్టుతా కట్టుకున్న ఇండ్లు ఎవనివి? కేటీఆర్, హరీశ్‌రావు, కేవీపీకి లేవా చుట్టుతా. మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాద్ ప్రజల తాగునీళ్లలో కలిపి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నరా?” అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
నల్గొండ జిల్లా విషంగా మారింది
‘‘మూసీకి కింద నల్గొండ జిల్లా ఉన్నది. ఎల్బీ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మునుగోడు, తుంగ తుర్తి, నకిరేకల్, ఆలేరు ఏరియాలో మూసీ ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాల భూములు ఉన్నయ్. ఒకవైపు ఫ్లోరైడ్, ఇంకోవైపు మూసీ మురికి ఉంది. నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నరు. రేపు పొద్దుగాల ఏం ముఖం పెట్టుకుని నల్గొండలో తిరుగు తావు కేటీఆర్. నల్గొండలో కాలుపెట్టు. ఒకసారి పో యి వస్తే అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తది. మూసీ మురుగుతో పంటలు ఎట్ల కలుషితం అవుతున్నదో చూద్దాం పద. అక్కడ నీళ్లు తాగి పశువులు చనిపో తున్నయ్. అక్కడ పాలు, కూరగాయలు కూడా తిన లేని పరిస్థితి ఉన్నది. కాలుష్యం వచ్చి నల్గొండ జిల్లా విషంగా మారింది. విషం దిగమింగుకుని నల్గొండ ప్రజలు బతుకుతున్నరు. బాగు చేయాలంటే మూసీ ప్రక్షాళన చేయాలి. అది బాగు చేద్దామంటే అడ్డం పడుతున్నారు. మీకు ఓట్లు వేయలేదని, ఒక్క సీటు కూడా మీరు అక్కడ గెలవకపోతే బావబామ్మర్దులు కలిసి నల్గొండ ప్రజలను చంపేద్దామని స్కీములే స్తారా?” అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గతంలో మూసీ ఆక్రమణల గురించి అసెంబ్లీలో మీరు మాట్లాడలేదా? అని ఆయన ప్రశ్నించారు.
అన్నింటికీ డిజిటల్ కార్డే..
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో 30 శాఖలకు సంబంధించిన సమాచారం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘మహిళలే కుటుంబ పెద్దగా డిజిటల్ కార్డు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్డు ఉంటే రేషన్ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫ్యామిలీ డిజిటల్ కార్డే.. రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు. ఇదే రైతుబీమా కార్డు. ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి, ఆర్టీసీ ఫ్రీ జర్నీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.. ప్రతి సంక్షేమ పథకానికి ఇదే అర్హత కార్డు. రేషన్ కార్డు కోసం ప్రజలు పదేండ్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్‌కార్డు రాదనే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. చాలామందికి రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్కార్డులు అవసరం. ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నాం” అని సీఎం తెలిపారు. ఇంటికి కొత్త కోడలు వచ్చినా, అమ్మాయికి పెండ్లి అయి అత్తగారింటికి వెళ్లినా.. వాళ్ల వివరాలన్నీ కంప్యూటరైజ్ అయి ఉంటే, ఈజీగా మార్చుకోవచ్చని చెప్పారు. అందుకే డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అప్పులు, తప్పులు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.
పేదలకు ఏం చేద్దామో చెప్పండి
‘‘మూసీ పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవానికి కాలనీలు చేసి మంచి ఇండ్లు కట్టిద్దామా చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూమి లేదా? గొడ్డు పోయిందా? జవహర్ నగర్లో 1,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మూసీ లో ఉన్న పేదలకు తలా 150 గజాలు ఇచ్చి ఇంది రమ్మ ఇండ్లు కట్టిద్దాం రండి. ఎవరైతే నమ్మి మోస పోయి మూసీ ఏరియాలో కట్టుకున్నారో వాళ్ల ఇండ్లు కట్టడానికి ఎంత అయిందో నష్టపరిహారం ఇద్దాం. ఖజానా నుంచి పంచుదాం. అందరం ఒకటే వేదిక మీద కూసొని పంచుదాం రండి. మీరు ప్రతిపక్షం అంటున్నరు కదా. రండి సచివా లయానికి నాలుగు రోజులైనా లెవ్వకుండా కూర్చుందాం” అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి హితవుపలికారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న చెరువుల లెక్క తీద్దామని, చెరువులల్లో ఎఫ్టీఎల్లో ఎవరున్నారు ? బఫర్ జోన్లలో ఎవరున్నారు ? నాలాలు ఎవరు ఆక్రమించుకున్నారు? ప్రభుత్వ పార్కులలో అక్రమ నిర్మాణాలు ఎవరు చేశారు? ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెంచర్లు ఎవరు వేశారు? ప్రైవేటు భూముల్లో అనుమతులు లేకుండా ఎవరు కట్టిన్రు లెక్కలు తీద్దామని సవాల్ చేశారు.
పేదల బాధ నాకు తెలుసు
పేదలు, మధ్యతరగతి వాళ్ల బాధ నాకు తెలుసు. వాళ్లు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నదాంట్ల నుంచి బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ఇండ్లు కొనుక్కున్నరు. వాళ్లకు ఏం చేయాల్నో ప్రభుత్వం అన్నీ చేస్తుంది. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించుకోవాలన్నా.. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాలన్నా అక్రమ నిర్మాణాలు తొలగించాలి. ఇందుకు ఎవరో ఒకరు నడుం బిగించాలి. నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతది. ఇప్పటికే చెరువులు, నాలాలు మూసుకుపోయినయ్. ఇంకా కొంతకాలం చూస్తే మూసీ కూడా మూసుకుపోతది. ఇవన్నీ మూసుకుపోయాక వర్షాలు, వరదలు వచ్చి మునిగేది మన ఇండ్లే.
సీఎం రేవంత్