
హైదరాబాద్: ధరణి రాష్ట్ర రైతులకు ఒక పీడ కల లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్‌తోనే తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి హత్య చేసే పరిస్థితి తలెత్తిందన్నారు. గత 65 ఏండ్లుగా భూములకు సంబంధించిన వివరాలను రెవిన్యూ సిబ్బందే కాపాడారు.. కానీ గత బీఆర్ఎస్ పాలకులకు ధరణి వచ్చాకే రెవిన్యూ సిబ్బంది దొంగలుగా కనిపించారా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపి వేలాది ఎకరాలను కొల్లగొట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన భూచట్టాలను ఉన్నఫళంగా తొలగించి.. ధరణి పోర్టల్ తీసుకొచ్చారని.. ధరణితో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్‌ను మాదాపూర్ శిల్పవేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) రోజున భూభారతి చట్టాన్ని 69 లక్షల కుటుంబాలకు అంకితం చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో 100 ఏళ్లు భూముల కోసమే పోరాటం జరిగిందని.. నిజాంకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం చేశారని గుర్తు చేశారు.
పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని భూసమస్యలు తెలుసుకున్నానని.. అప్పుడే ధరణి స్థానంలో కొత్త వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక ధరణిని బంగళాఖాతంలో వేస్తామని అనాడే చెప్పాం.. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను తీసేసి దాని స్థానంలో భూభారతి తీసుకొచ్చామన్నారు. వివిధ రాష్ట్రాల్లో భూచట్టాలను పరిశీలించాకే భూభారతి చట్టం రూపొందించామని తెలిపారు. అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకున్నాకే పోర్టల్‌ను ప్రారంభించామన్నారు.
పైలెట్ ప్రాజెక్ట్‌గా 4 మండలాలను తీసుకున్నామన్నారు. ప్రతీ గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే రెవెన్యూ సిబ్బంది ముఖ్యం. రెవెన్యూ సిబ్బందిని మా ప్రభుత్వం 100 శాతం నమ్ముతుందని పేర్కొన్నారు. తాము చేసే తప్పులకు రెవెన్యూ సిబ్బందిని బలి చేసే సంస్కృతికి మేం వ్యతిరేకమని స్పష్టం చేశారు. గత సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను ఎలా దూషించారో చూశాం. ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టే వ్యవహారం చేశారు. కానీ రెవెన్యూ సిబ్బంది ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవమని అన్నారు.
69 లక్షల మందికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ రెండు కళ్లలాంటివన్నారు. మనుషులకు ఆధార్ మాదిరిగా భూములకు భూదార్ అని అన్నారు. భూమి హద్దులు నిర్ణయించేంది రెవెన్యూ సిబ్బందేనని.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రెవెన్యూ సిబ్బంది చూసుకోవాలని సూచించారు. రైతులు పిలిచి భోజనం పెట్టి మాట్లాడేలా రెవెన్యూ సిబ్బంది తీరు ఉండాలని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ప్రతి మండలంలో పర్యటించాల్సిదేనన్నారు.