పేదలకు సన్నబియ్యం .. ఇయ్యాల్టి నుంచి రేషన్ ​షాపుల్లో పంపిణీ

పేదలకు సన్నబియ్యం .. ఇయ్యాల్టి నుంచి రేషన్ ​షాపుల్లో పంపిణీ
  • ఉమ్మడి జిల్లాలో 7.59 లక్షల రేషన్ ​కార్డులు  
  • ప్రతి నెల కోటా 15214.95 మెట్రిక్ టన్నులు 
  • ఇప్పటికే షాపులకు 45 శాతం కోటా సప్లై

మంచిర్యాల, వెలుగు: రేషన్​ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్​ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్​రెడ్డి ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ నెల 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్​ షాపుల్లో కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. ఎప్పటిలాగే యూనిట్​కు ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యూనిట్లు అందించనున్నారు. కొత్తగా రేషన్​ కార్డుల కోసం అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నవారికి కూడా సన్నబియ్యం అందజేస్తామని సివిల్ సప్లైస్
​మినిస్టర్ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

దొడ్డు బియ్యం అమ్ముకున్నరు

పేదలకు ఆహార భద్రతలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాయి. క్వాలిటీ లేని దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలు వాటిని తినడానికి ఇష్టపడడం లేదు. దీంతో ఆ బియ్యాన్ని డీలర్లకు, దళారులకు కిలో రూ.10 నుంచి రూ15కు అమ్ముకొని మార్కెట్​లో సన్నబియ్యం కొనుక్కొని తింటున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే దొడ్డు బియ్యం తింటుండగా.. మిగిలిన 80 పర్సెంట్ ​రీసైక్లింగ్ జరుగుతోంది. 

రేషన్ ​బియ్యం పంపిణీకి ప్రభుత్వానికి కిలోకు రూ.35 వరకు ఖర్చవుతున్నా పేదలకు ఉపయోగపడడం లేదు. వారి పేరిట డీలర్లు, దళారులు, మిల్లర్లు, అధికారులు బాగుపడుతున్నారు. ఈ పరిస్థితి గుర్తించిన కాంగ్రెస్ ​పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు సన్నబియ్యం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక కొంత ఆలస్యమైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చింది.  

సన్నబియ్యం కిలో రూ.50

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నబియ్యంపై కిలోకు రూ.50 ఖర్చుపెడుతూ పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. గత యాసంగి సీజన్​లో కొనుగోలు సెంటర్ల ద్వారా సేకరించిన సన్న వడ్లను ఇక్కడే మిల్లింగ్ ​చేశారు. అదే బియ్యాన్ని సీఎంఆర్ ​కింద తీసుకుని ఎంఎల్​ఎస్​ పాయింట్లలో స్టాక్​ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 7,59,569 రేషన్ కార్డులకు ప్రతి నెలా 15214.95 మెట్రిక్​ టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఆ మేరకు జిల్లాలో అందుబాటులో లేకపోతే పొరుగు జిల్లాల నుంచి కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 1509 రేషన్​షాపులు ఉండగా, ఇప్పటికే 50 శాతం సన్న బియ్యం చేరాయి. మిగతా కోటా త్వరలోనే సప్లై చేస్తామని ఆయా జిల్లాల సివిల్​ సప్లైస్​ ఆఫీసర్లు​ తెలిపారు.