
- ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం కోసం రూ.857.76 కోట్ల ఖర్చు
- రేపటి నుంచి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ
సూర్యాపేట, వెలుగు: పేదల్లో సన్న బియ్యం సంబరం మొదలైంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన ధారవత్ బుజ్జి, మాలోతు రంగా, కర్ల రాధ, చెడపంగు లక్ష్మి, షేక్ రహిమాన్, షేక్ కరీమా, కర్పూరపు లక్ష్మి, గుండెబోయిన గురువమ్మ, చిరుమామిళ్ల సుశీల, కర్ణ వెంకట పుష్ప లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం హుజూర్నగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. సభా వేదికపై మంత్రులతో కలిసి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. రేషన్ కార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేశారు.
అనంతరం సూర్యాపేట జిల్లాలోని 12,771 మహిళా సంఘాలకు ఇందిర మహిళాశక్తి పథకం కింద వడ్డీ రాయితీ రూ.26.10 కోట్ల చెక్కును సీఎం అందజేశారు. అంతకుముందు హుజూర్ నగర్ లో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సీతారామస్వామి గుట్ట వద్ద ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను ఈ ప్రాంతంలో నిర్మిస్తుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. అత్యధికంగా ఒకే చోట అన్ని హంగులతో ఇండ్లను నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఉమ్మడి జిల్లాలో 29,28,549 మంది లబ్ధిదారులు..
రేషన్ కార్డులో ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 29,28,549 మంది లబ్ధిదారులకు ప్రతినెలా ఆరు కిలోల చొప్పు న సన్నబియ్యం అందుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంఎల్‌ఎస్ పాయింట్లకు అవసరమైన సన్న బియ్యాన్ని పంపిణీ పూర్తి చేశారు. వానాకాలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సన్న వడ్లను కొని సీఎంఆర్ కింద మిల్లులకు సరఫరా చేశారు. ఇందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు చేరవేయగా, ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్‌ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా మొదలైంది.
సన్నబియ్యాన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు కిలోకు రూ.40 వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, ఉమ్మడి జిల్లాలో ప్రతినెలా కనీసం 17,869 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతినెలా రూ.71.48 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. ఏడాదికి కనీసం రూ.857.76 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. నల్గొండ జిల్లాలో 4,66,522 రేషన్ కార్డులు ఉండగా, 13,85,605 యూనిట్లు ఉన్నాయి. నెలకు 8,878 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో 3,05,564 రేషన్ కార్డులు ఉండగా, 8,79,000 యూనిట్లు ఉన్నాయి. నెలకు 4,470 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో 2,17,072 రేషన్ కార్డులు ఉండగా, 4,241 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.