
హైదరాబాద్, వెలుగు: వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ విద్యార్థులు ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్లు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుగా అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ పేరును మహి ళా వర్సిటీకి పెట్టుకోవడం తెలంగాణకు గర్వకారణం.
1924లో ఏడుగురు విద్యార్థులతో మొదలైన ఈ కాలేజీ వందేండ్లు పూర్తి చేసుకుంది. నేడు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా మారి 7 వేల మంది విద్యార్థులకు చదువు అందిస్తున్నది” అని చెప్పారు. శనివారం హైదరాబాద్ కోఠిలోని మహిళా వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఉండాలని ఆనాడు రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. మహిళా వర్సిటీ విద్యార్థులు రాజకీయాల్లోనూ రాణించి రాజీవ్ గాంధీ కలల్ని నిజం చేయాలి” అని కోరారు.
మహిళలకు అధిక ప్రాధాన్యం..
రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ ని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. అమ్మ ఆదర్శ పాఠశాల ల నిర్వహణబాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిం చాం. అలాగే స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యత కూడా ఇచ్చాం. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలో వెయ్యి బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నాం.
దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరం. అవకాశం వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారు. వాళ్లు వ్యాపారంలో అదానీ, అంబానీలతో పోటీపడేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం” అని చెప్పారు.
రెండున్నరేండ్లలో పనులు కావాలి..
మహిళా వర్సిటీలో అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించేదుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని, నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని దేశానికి మంచిపేరు తీసుకురావాల న్నారు.
వర్సిటీలో నూతన భవనాల నిర్మాణం, దర్బార్ హాల్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.. ఆ పనులన్నీ రెండున్నరేండ్లలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, వర్సిటీని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ సూర్యధనుంజయ తదితరులు పాల్గొన్నారు.