- మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇయ్యలే
- ఏ రాష్ట్రమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్త
- 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఒక్కటీ భర్తీ చేయలే
- రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: తమ పదేండ్ల పాలనలో ఇచ్చినన్ని ఉద్యోగాలను, దేశంలో ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ తమకంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్టుగా నిరూపిస్తే మరుసటి రోజే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన చాలెంజ్ చేశారు.
శనివారం కేటీఆర్తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. కొత్త ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చి, 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చేశామని, దేశంలో 95 శాతం ఉద్యోగాలు లోకల్ వాళ్లకే వచ్చే సిస్టమ్ తెలంగాణలో తప్ప, ఇంకెక్కడా లేదని పేర్కొన్నారు. తమ కంటే ముందు పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 24,086 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసిందని, అందులో తెలంగాణకు 10,084 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చెప్పారు. తమ పదేండ్ల పాలనలో 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. 24 వేల పరిశ్రమల ఏర్పాటుకు పర్మిషన్లు ఇచ్చి, 24 లక్షల ఉద్యోగాలను ప్రైవేటు రంగంలో సృష్టించామని తెలిపారు. ఇంతకంటే ఎక్కువ నియామకాలు చేపట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంటే బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు చూపించాలని సవాల్ విసిరారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో తాము చేసిన పనులను ప్రజలకు, యువతకు సరిగా చెప్పుకోలేకపోయామని అన్నారు. 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నదని, వాళ్లకు దమ్ముంటే ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీలను చెప్పాలని కేటీఆర్ సవాల్ చేశారు. ‘‘ఈ 32 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది, పరీక్షలు పెట్టింది మేమే.. కేవలం రిజల్ట్స్ ఇచ్చి, ఉద్యోగాలు తామే భర్తీ చేసినట్టుగా కాంగ్రెస్ చెప్పుకుంటోంది. పోలీస్ ఉద్యోగాల రిజల్ట్స్ కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది” అని కేటీఆర్ వివరించారు. రేవంత్ సర్కార్ వచ్చాక అన్నీ మోసాలే జరుగుతున్నాయని ఆరోపించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ మీద అతీగతీ లేదు అని, నిరుద్యోగ భృతి హామీపై మాట తప్పారని దుయ్యబట్టారు.
పరిశ్రమలు తరలిపోతున్నయ్
ఫార్మా సిటీతో 5 లక్షల ఉద్యోగాలకు తాము రంగం సిద్ధం చేస్తే, అది రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేయడానికి సిద్ధపడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై బీఆర్‌యూ(భట్టి, రేవంత్, ఉత్తమ్) ట్యాక్స్ వేస్తుండడంతో పరిశ్రమలన్నీ వెనక్కు పోతున్నాయని అన్నారు. కేన్స్ టెక్నాలజీని తాము కష్టపడి రాష్ట్రానికి తీసుకొచ్చామని, వారం రోజుల్లోనే ల్యాండ్ కూడా కేటాయించామని చెప్పారు. ఈ కంపెనీతో 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని, కాంగ్రెస్ వచ్చాక వాళ్లను ఏదో అనడంతో తట్టాబుట్ట సర్దుకొని తమిళనాడుకు వెళ్లిపోయారని కేటీఆర్ ఆరోపించారు. కార్నింగ్ అనే సంస్థ వెయ్యి కోట్ల పెట్టబడి పెట్టడానికి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్లు కూడా గుజరాత్‌కు వెళ్లిపోయారని తెలిపారు. వరంగల్ నుంచి టెక్ మహీంద్రా సంస్థ వెళ్లిపోతోందని చెప్పారు. ఇవన్నీ గ్రాడ్యుయేట్లు అర్థం చేసుకోవాలని, బీఆర్‌ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తమ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉందని, ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించి గ్రాడ్యుయేట్లకు న్యాయం జరిగేలా కష్టపడుతాడని చెప్పారు
కరెంట్ పోతే జనరేటర్లు లేవా?
ఎత్తైన బిల్డింగుల్లో హాస్పిటల్ ఉంటే ఎలా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు.. కరెంట్ పోతే ఇబ్బంది అవుతుందని మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కరెంట్ పోతే జనరేటర్లు లేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన మంత్రా? జోకరా? అని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ సర్కారు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేసిందని అన్నారు. కాపర్ డ్యామ్ కట్టి మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయాలని కేసీఆర్ చెబితే పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్‌డీఎస్‌ఏ కూడా అదే చెప్పిందని తెలిపారు. చివరకు కేసీఆర్ చెప్పిందే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నదని అన్నారు.