కోడ్ ముగియగానే కులగణన : సీఎం రేవంత్ రెడ్డి

కోడ్ ముగియగానే కులగణన : సీఎం రేవంత్ రెడ్డి
  • అసెంబ్లీలో తీర్మానం చేసి బడ్జెట్ కేటాయించినం
  • కేంద్రంలో కులగణనపైనే ‘ఇండియా’ సర్కారు తొలి సంతకం 
  • తనను కలిసిన బీసీ సంఘాల నేతలకు సీఎం హామీ
  • కాంగ్రెస్ కే బీసీల మద్దతు: జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ర్టంలో కులగణన ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చామని, ఆ హామీ మేరకు కులగణన చేపట్టడానికి అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామన్నారు. కులగణన ప్రాసెస్ కోసం రూ. 150 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించామన్నారు. 

శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆయనతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తో కలిసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్,  బీసీ నేతలు శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక సర్వే, కులగణన చేపడతామని ఇండియా కూటమి హామీ ఇచ్చిందన్నారు. కులగణన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు పెంచడమే కాకుండా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ తదితర డిమాండ్లను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. 

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన ఫైలు మీదే మొదటి సంతకం చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టమైన హామీని ఇచ్చారన్నారు. అందుకే బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని బీసీ సంఘాల నేతలను రేవంత్ కోరారు. కాగా, బీసీల డిమాండ్లను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చినందున, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో బీసీలంతా అండగా ఉండాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.