కవిత, కేటీఆర్ ఏ పార్టీకి ఓటేస్తారు..? ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్

కవిత, కేటీఆర్ ఏ పార్టీకి ఓటేస్తారు..? ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్

మంచిర్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత, కేటీఆర్ ఏ పార్టీకి ఓటేస్తారని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఎజెండా ఏంటని,  వీళ్ల కుట్రలు సమాజం గమనించాలని పట్టభద్రులకు సీఎం సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు అభ్యర్థులే లేరని.. కానీ కాంగ్రెస్ను ఓడించాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని, ఏ పార్టీ మేలో పట్టభద్రులు ఆలోచించాలని సీఎం సూచించారు.

బీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేయమని చెబుతున్నారని, అసలు బీఆర్ఎస్ ఏ పార్టీకి మద్దతిస్తుందని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచిందని, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడలేదా అని సీఎం ప్రశ్నించారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి తెచ్చింది ఏంటని, ఢిల్లీలో రెండు పార్టీల మధ్య ఏ ఒప్పందం జరిగిందని రేవంత్ రెడ్డి నిలదీశారు.

Also Read:-బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు 18 శాతం నిధులు కేటాయించాలి..

గ్రాడ్యుయేట్లు ఓటేసే ముందు ఆలోచించాలని, తాము చెప్పేది అబద్ధం అయితే ఓటు వేయొద్దని రేవంత్ చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని మోదీ చెప్పారని, తెలంగాణకు మోదీ కోటి ఉద్యోగాలు బాకీ పడ్డారని సీఎం చెప్పారు. తెలంగాణకు మోదీ ఇచ్చిన ఉద్యోగాలు రెండేనని.. బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. 65 ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి ఏటీఐలుగా మార్చామని పట్టభద్రులకు సీఎం రేవంత్ గుర్తుచేశారు.