- ఇక్కడి గెలుపే నన్ను సీఎంను చేసింది
- పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ బైపోల్ లోనూ గెలవాలి
- హోలీలోగా ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటిస్తుంది
- మీరే నా బలం.. బలగం.. ప్లాన్డ్ గా ప్రచారం చేయాలి
- మల్కాజ్ గిరి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం ఎన్నిక అభ్యర్థిది కాదని, ముఖ్యమంత్రిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. తనను సీఎంను చేసింది మల్కాజ్ గిరి గెలుపేనని గుర్తు చేశారు. అప్పుడు నాయకులు అమ్ముడు పోయినా కార్యకర్తలను భుజాలపై ఎత్తుకొని మోసి తనను ఢిల్లీకి పంపించారని అన్నారు. 2,964 బూత్ లలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని చెప్పారు. కేసీఆర్ పతనం 2019లో మల్కాజ్ గిరి నుంచే మొదలైందని అన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసునుకున్నామని చెప్పారు.
మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా.. కాంగ్రెస్ ను గెలిపించుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రమంతా కాంగ్రెస్ తుఫాను వచ్చినా మల్కాజ్ గిరిలో రాలేదని అన్నారు. అందుకే ఈ సారి మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. హోలీ పండగలోగా కాంగ్రెస్ అధినాయకత్వం అభ్యర్థులను ప్రకటిస్తుందని సీఎం చెప్పారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని సీఎం భరోసా ఇచ్చారు. నాయకులు కార్యకర్తలే తన బలం.. బలగమని, ప్రణాళికా బద్దంగా ప్రచారం చేయాలని సూచించారు. ఉదయం 7 గంటలకే బస్తీ బాట పట్టాలని అన్నారు. మల్కాజ్ గిరి మోడల్ క్యాంపెయిన్ రాష్ట్రమంతా అనుసరించేలా ఉండాలన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ గెలవాలని సూచించారు