ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లతో సమావేశమయ్యారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో గురువారం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమే. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం’అన్నారు.
యునెస్కో 1016 సంవత్సరంలోనే లండన్ లోని వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలోనే ఈ సమావేశం జరిగింది. లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
“నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి.. వీటన్నింటికీ విరుగుడు ప్రజాస్వామ్యం పటిష్టం చేయటం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం.‘ అన్నారు.
ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ‘ఒకప్పుడు మీ దేశం మా దేశాన్ని పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీనే మీకు వ్యతిరేకంగా పోరాడింది. అప్పుడు మహాత్మ గాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే మీ దేశానికైనా మా దేశానికైనా ఇప్పటికీ మార్గదర్శకం..‘ అన్నారు.
ఇదే సందర్భంగా తన స్వీయ అనుభవాలను సీఎం వారితో పంచుకున్నారు. ‘నాది గ్రామీణ ప్రాంతం. నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఎంచుకున్న ప్రజాస్వామ్య భావనతోనే నాకు ఇంతటి అవకాశం వచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశాలు అసలైన ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయి‘ అన్నారు.