- రూ.1.63 లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి: సీఎం రేవంత్
- రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్– 2, మూసీ రివర్ ఫ్రంట్‌కు ఫండ్స్ ఇప్పించండి
- మూసీ–గోదావరి లింక్, హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ యూజీడీ ప్లాన్‌కు సాయం చేయండి
- సింగరేణికి కోల్ బ్లాక్‌లు కేటాయించండి
- ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, గడ్కరీని కలిసి వినతులు
ఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు.ట్రిపుల్ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్- –2తోపాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై కేంద్ర మంత్రులకు వినతులిచ్చారు.
రాష్ట్రంలో రూ.1.63 లక్షల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ కోరారు. ట్రిపుల్ఆర్ నిర్మిస్తామని ప్రధాని మోదీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ట్రిపుల్ఆర్ నార్త్ భాగం భూ సేకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, త్రైపాక్షిక ఒప్పందం పూర్తయినా ఇప్పటి వరకు ఎన్‌హెచ్ఏఐ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ట్రిపుల్ఆర్సౌత్ భాగానికి ఇంకా అనుమతి ఇవ్వని విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.
ట్రిపుల్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండస్ట్రియల్ హబ్స్, లాజిస్టిక్, రిక్రియేషన్ పార్క్స్ వస్తాయని సీఎం చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు రెండు వైపులా పూర్తికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు అని వివరించారు. ఓఆర్ఆర్–ట్రిపుల్ ఆర్ అనుసంధానానికి రేడియల్ రోడ్లు నిర్మించాలని భావిస్తున్నామని కిషన్‌రెడ్డికి తెలిపారు. 10 గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతోపాటు ఓఆర్ఆర్ ను అనుసంధానించే మెట్రో కారిడార్ రేడియల్ రోడ్లకు రూ.45 వేల కోట్లు అవసరమవుతాయని వివరించారు.
వినతులివే..
మెట్రో ఫేజ్ –2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్, -పటాన్ చెరు, ఎల్‌బీ నగర్, -హయత్ నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీటర్లలో నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్లవుతుందని అంచనా వేసినట్టు సీఎం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 50:50 వాటాతో మెట్రో ఫేజ్– 2 ను చేపట్టేందుకు సహకరించాలని సీఎం కోరారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఇప్పటికే కోరామన్నారు. ఆ భూముల బదలాయింపుతోపాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణంతోపాటు ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశామని, నిధుల మంజూరుతో పాటు అనుమతులకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం తెలిపారు. ఆ మొత్తం విడుదలకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు.
హైదరాబాద్ నగరంతో పాటు సమీప 27 మున్సిపాలిటీల్లో 7,444 కి.మీ మేర సీవరేజీ నెట్‌వర్క్ పనులకు రూ.17,212.69 కోట్లతో సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ రూపొందించామని సహకరించాలని విన్నివించారు.
తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌ను రూపకల్పన చేశామని, రూ.4,170 కోట్లు ఖర్చయ్యే ఈ ప్లాన్‌ను అమృత్ 2 లేదంటే ప్రత్యేక పథకం కింద చేపట్టాలని సీఎం కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ అయిన సింగరేణి ప్రత్యక్షంగా 43 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించడంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. దీర్ఘకాలంపాటు సింగరేణి సంస్థ మనుగడ సాగించేందుకుగాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని కోరారు. సెమీ కండక్టర్ల ప్రాజెక్టులకు హైదరాబాద్ అనువుగా ఉన్నదని, నిపుణులైన కార్మికులు, మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను పరిగణనలోకి తీసుకొని, తెలంగాణను సెమీకండక్టర్ మిషన్ లో చేర్చాలని విజ్ఞప్తిచేశారు.
ట్రిపుల్ఆర్కు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇవ్వండి
ట్రిపుల్ఆర్నార్త్ భాగానికి (159 కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. 2017లోనే ట్రిపుల్ ఆర్ నార్త్ భాగాన్ని 161ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్ తో అనుసంధానించే ఎన్ హెచ్-765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని, మిగిలిన 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటివేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తున్నదని తెలిపారు.
ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇందుకు 2024–25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్– ఏపీలోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. తెలంగాణ, ఏపీలోని ముఖ్య నగరాలైన హైదరాబాద్ – విజయవాడ (ఎన్.హెచ్-65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయాలని గడ్కరీని కోరారు.
వరంగల్ సౌత్ బైపాస్ అనుమతి కోసం రిక్వెస్ట్
వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం కోరారు. తెలంగాణ–చత్తీస్‌గఢ్‌ను అనుసంధానించే ఎన్‌హెచ్-–63 (16) వరంగల్, హన్మకొండ నగరాల మధ్యగా వెళ్తున్నదని, ఈ రహదారిని నగరం వెలుపల నుంచి 4 చోట్ల కలుపుతూ బైపాస్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్వత్ మాల ప్రాజెక్ట్ లో యాదాద్రి దేవాలయం, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వే లను ఏర్పాటు చేయాలని కోరారు.
గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని, నల్గొండ జిల్లాల్లో ఎన్.హెచ్-65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు జి. వంశీకృష్ణ, బలరాం నాయక్, ఎం. అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్ షెట్కార్, మల్లు రవి, కడియం కావ్య, ఎం. అనిల్ కుమార్ యాదవ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి ఉన్నారు.
కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలి
తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రానికి ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ కూడా కేటాయించలేదని, కేంద్రీయ విద్యాలయాలతోపాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని, కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్వోసీ తీసుకునేలా చూడాలని కోరారు.