సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజీగా గడుపుతున్నారు. నవంబర్ 26న ఢిల్లీలో ప్రియాంక గాంధీని కలిశారు రేవంత్, భట్టి విక్రమార్క. వయనాడ్ లో ఎంపీగా గెలిచిన ప్రియాంకకు అభినందనలు తెలిపారు. కాసేపట్లో పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యలపై చర్చించనున్నారు రేవంత్.
అలాగే ఢిల్లీ ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు రేవంత్. ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9న సెక్రటేరియెట్ ప్రాంగణంలో లక్ష మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
Also Read :- ఈవీఎంలపై మరోసారి జగన్ సంచలన ట్వీట్..
ఇదిలా ఉంటే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనలో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుందామని ఆయనకు, రాష్ట్ర ఇతర మఖ్యనేతలకు ఏఐసీసీ తెలిపింది. మంత్రివర్గ విస్తరణపై కూడా తాజాగా హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.