గౌర‌వెల్లి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి: కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ: తెలంగాణ‌లో చేప‌డుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ వెంటనే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌‎ను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. గురువారం (జనవరి 16) ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భ‌వ‌న్‌లో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల‌ను నివేదించారు. కేంద్ర అట‌వీ శాఖ అనుమ‌తులు రాక‌పోవ‌డంతో తెలంగాణ‌ వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయ‌ని వివ‌రించారు. 

38 ప్రాజెక్టుల‌కు వ‌న్యప్రాణి సంర‌క్షణ చ‌ట్టాల పర‌మైన అనుమ‌తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటికి తక్షణం అనుమతులు మంజూరు చేయాల‌ని కోరారు. ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, వామ‌ప‌క్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయ‌ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. అనుమ‌తులు రాక‌పోవ‌డంతో జాతీయ ర‌హ‌దారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో ట‌వ‌ర్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, పొరుగు రాష్ట్రాల‌ను అనుసంధానించే ర‌హ‌దారుల నిర్మాణ ప‌నులు నిలిచిపోయాయ‌ని తెలిపారు.

ALSO READ | తెలంగాణకు 2800 బస్సులు ఇవ్వండి: కేంద్రమంత్రికి CM రేవంత్ రిక్వెస్ట్

గౌర‌వెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమ‌తుల మంజూరు చేయాల‌ని కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.