న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్‌లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. గురువారం (జనవరి 16) కేంద్రమంత్రి కుమార స్వామితో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు.
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో తెలంగాణకు బస్సులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ALSO READ | లై డిటైక్టర్ టెస్ట్‌కు సిద్ధమా..? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, కె. రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.