ఇన్​చార్జిలుగా సీనియర్లు .. జహీరాబాద్​లో పార్టీల వ్యూహం

ఇన్​చార్జిలుగా సీనియర్లు .. జహీరాబాద్​లో పార్టీల వ్యూహం
  • కార్యకర్తలకు దిశానిర్దేశం
  • అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మీటింగులు

కామారెడ్డి, వెలుగు : జహీరాబాద్​పార్లమెంట్ స్థానం నుంచి గెలిచేందుకు మూడు ప్రధాన పార్టీలు పట్టుదలతో పని చేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రచార జోరు పెంచుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్​ నుంచి మాజీ ఎంపీ సురేశ్​ షేట్కార్​, బీజేపీ నుంచి ఎంపీ బీబీపాటిల్​, బీఆర్​ఎస్​ నుంచి గాలి అనిల్​కుమార్​లు పోటీ చేయనున్నారు. సీనియర్​ నాయకులను పార్లమెంట్​ఇన్​చార్జిలుగా నియమించి పార్టీని గెలిపించే బాధ్యతలు వారికి అప్పగించారు.

ఇన్​చార్జిలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మీటింగ్​లు పెడుతూ కేడర్​ను ప్రచారానికి సన్నద్ధం చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఇక్కడ గెలిచిన బీఆర్​ఎస్ మూడోసారి కూడా విజయం సాధించాలని ఆరాటపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ .. జహీరాబాద్​లో మళ్లీ పాగా వేయాలని చూస్తోంది. బీఆర్​ఎస్ నుంచి బీజేపిలో చేరిన బీబీ పాటిల్​హాట్రిక్​ మీద కన్నేశారు. ఆయన మోదీ, అయోధ్య రామమందిరాల మీద ఆశలు పెట్టుకున్నారు. 
 
కాంగ్రెస్​కేడర్​లో జోష్​

జహీరాబాద్​లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కాంగ్రెస్​గట్టి పట్టుదలతో ఉంది. కాంగ్రెస్​ అభ్యర్థి సురేశ్ షేట్కార్​ ఇది వరకు ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన క్రీయాశీలంగా పని చేశారు. పార్లమెంట్​ పరిధిలో విస్తృత పరిచయాలు ఉండటం, నియోజకవర్గంతో ఆయన సామాజిక వర్గం బలంగా ఉండడం, బీసీ కార్డు కలిసి వస్తాయని భావిస్తున్నారు.

అభ్యర్థిని ప్రకటించిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డి జహీరాబాద్​ పరిధిలోని ముఖ్యనేతలతో రెండుసార్లు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో ప్రచారం, ఎన్నికల వ్యుహాలపై చర్చించారు. పార్లమెంట్​నియోకవర్గానికి ఇన్​చార్జిగా సీనియర్​మంత్రి దామోదర రాజనర్సింహాను నియమించారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ సీనియర్​ నాయకులకు మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధికారంలోకి రావడంతో గ్రామస్థాయి నుంచి కేడర్​ ఉత్సాహంగా పని చేస్తోంది. 

ప్రచారంలో బీజేపీ ముందంజ..

బీజేపీ తరపున సిట్టింగ్​ ఎంపీ బీబీపాటిల్​ బరిలో ఉన్నారు. బీఆర్​ఎస్​ నుంచి రెండుసార్లు గెలిచిన ఆయన ఇటీవల బీజేపీలో చేరి టికెట్​ దక్కించుకున్నారు. బీజేపీ జహీరాబాద్​పార్లమెంట్​ ఇన్​చార్జిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డిని నియమించింది. అభ్యర్థిని ప్రకటించకముందే పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వెంకటరమణారెడ్డి మీటింగ్​లు నిర్వహించారు. ఆతర్వాత మండలాల వారీగా మీటింగ్​లు పెడుతున్నారు. హైదరాబాద్​లో బూత్​ కన్వీనర్లతో మీటింగ్​నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. 10 ఏండ్లు ఎంపీగా ఉన్న పాటిల్​ నియోజక వర్గాల్లో తనకున్న పరిచయాలు కూడా కలిసివస్తాయని ఆశిస్తున్నారు.

గెలుపు కోసం బీఆర్ఎస్ ఆరాటం 

సిట్టింగ్​ ఎంపీ పాటిల్​ సరిగ్గా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్​ అభ్యర్థి కోసం వెతుక్కోవాల్సివచ్చింది. చివరికి గాలి అనిల్​కుమార్​ పేరును కేసీఆర్​ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో గులాబీ శ్రేణులు డీలా పడినా.. ఇక్కడ గెలవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్​అసెంబ్లీ సెగ్మెంట్లలో మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించే బాధ్యతను మాజీ మంత్రి హరీశ్​ రావు, మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి తీసుకున్నారు. .అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదన్న ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లి లాభపడాలని ఆశిస్తున్నారు.