హీరో భగవత్ స్వరూపుడా.. ఆయన తప్పు చేసినా చర్యలు తీసుకోవద్దా: సీఎం రేవంత్ రెడ్డి

హీరో భగవత్ స్వరూపుడా.. ఆయన తప్పు చేసినా చర్యలు తీసుకోవద్దా: సీఎం రేవంత్ రెడ్డి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని చూశాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హీరోపైన కేసు పెడితే వీళ్లకెందుక బాధ అవుతుందో అర్థం కావడం లేదని అన్నారు. హీరో మా ఫ్రెండు.. అతడు తప్పు చేసినా కేసులు పెట్టొద్దు అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  హీరో భగవత్ స్వరూపుడు.. ఆయన మీద చేయి వేయకూడదు.. అన్నట్లు వీళ్ల వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. 

మేము ఉద్యమాలు చేశామని చెప్పుకునే వీళ్లకు కనీస బాధ్యత ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తల్లి చనిపోయి.. కొడుకు కోమాలో ఉంటే.. దీనిపై కూడా రాజకీయం చేయాలని చూశారని.. వీళ్లకు కనీసం మానవత్వం కూడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | బెనిఫిట్ షోలు బంద్.. టికెట్ రేట్ల పెంపు అసలే లేదు : సీఎం రేవంత్.. సినిమా వాళ్లను రఫ్పాడించాడు

నెలకు 30 వేల జీతం ఉన్న ఒక సాధారణ వ్యక్తి.. తన కొడుకు, భార్య అల్లు అర్జున్ అభిమానులని, 3 వేలకు ఒక టికెట్ చొప్పున 12 వేలు పెట్టి సినిమా చూడటానికి వచ్చారని సంధ్య థియేటర్ ఘటనపై చర్చలో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయి కూడా పిల్లోడి చేయిన వదలకుండా పట్టుకుందని, తల్లి ప్రేమ అలా ఉంటుందని.. హృదయవిదారక ఘటన అని సీఎం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇంత జరిగాక కూడా దీనికి కారకులైన హీరో, థియేటర్ యాజమాన్యంపై కేసులు పెట్టొద్దా అని ప్రశ్నించారు.

ఇంత హృదయవిదారక ఘటనపై కూడా పార్టీలు రాజకీయం చేయాలని చూశాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టించి తనపై, తమ ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలని దుర్మార్గమైన ఆలోచన చేశారని విమర్శించారు. ఈ ఘటనపై ఒకాయన ట్విట్టర్ లో పెట్టి వ్యతిరేక ప్రచారం చేయాలని చూశారని పరోక్షంగా కేటీఆర్ ను విమర్శించారు.