అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో ఎంత పెద్దవారైనా ఆపేది లేదన్నారు. నాలాలు, FTL, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫాంహౌస్ అక్రమమని అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్ చాట్ లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫాంహౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడం ఐనా దగ్గరుండి కూల్చివేయిస్తానని స్పష్టం చేశారు రేవంత్. కేటీఆర్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ నేత పల్లం రాజు కట్టడాన్నే హైడ్రా మొదలు కూల్చివేసిందన్నారు.
చెరువు ,శిఖం భూముల్లో ఫామ్ హౌసులు కట్టుకుంటే తప్పు కానీ వ్యవసాయం చేస్తే తప్పు లేదన్నారు రేవంత్ రెడ్డి. జంట జలాశయాలను రక్షించడమే తమ బాధ్యత అని చెప్పారు రేవంత్. ఫాంహౌసులు కట్టుకున్న సెలబ్రిటీలు మురుగునీటిని జలాశయాల్లో వదిలేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతానికి హైదరాబాద్ కే హైడ్రా పరిమితం అన్నారు. హైడ్రా తన పని తాను చేసకుంటూ పోతుందన్నారు రేవంత్. 30 ఏళ్ల కింద కట్టిన అక్రమ కట్టడాలైనా కూల్చేస్తామన్నారు. కేటీఆర్ కు దమ్ముంటే తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడాలకు సంభంధించి ఆధారాలతో రావాలన్నారు. చెరువులు, కుంటల్లో కొన్ని బిల్డింగ్ లు కట్టుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు రేవంత్. సెక్రటేరియట్ జిహెచ్ఎంసి లాంటి భవనాలపై సుప్రీంకోర్టు అనుమతి ఉందన్నారు.