- ఈ నెల 8లోపు రైతు భరోసా పూర్తి చేస్తం.. లేకుంటే నేను ముక్కు నేలకు రాస్త
- సవాల్‌కు సిద్ధమా?:
- రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు రూ. 7 లక్షల కోట్లు
- ఇప్పటిదాకా రూ. 27 వేల కోట్లు మిత్తీలకే కట్టినం
- భట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడ్తున్నడు
- పంద్రాగస్టులోపు రుణ మాఫీ చేసి తీరుతాం
- ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర
- పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా?
- బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు.. కాంగ్రెస్ గెలిస్తేనే రిజర్వేషన్లు
- ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వ్యాఖ్యలు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర ప్రజల నెత్తిమీద కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయారని, ఇప్పటివరకు తాము ఆ అప్పుకే రూ. 27 వేల కోట్ల మిత్తి చెల్లించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇట్ల మిత్తీలు కడ్తూనే ప్రతి నెలా ఫస్ట్ తారీఖున ఉద్యోగులకు జీతాలిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ ఆగం చేస్తే.. దాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాడిన పెడ్తున్నారని ఆయన తెలిపారు. ‘‘రైతు భరోసా ఏదని కేసీఆర్ అంటున్నడు. ఆయన మందేసిండో, మందు దిగి మాట్లాడుతున్నడో అర్థమైతలేదు. 69 లక్షల మందికి గానూ ఇప్పటివరకు 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసినం. మిగిలిన 4 లక్షల మంది ఖాతాల్లో ఈ నెల 8లోపు జమ చేస్తం. ఈ నెల 9లోపు ఏ ఒక్క రైతుకు బకాయి ఉన్నా అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్త. లేదంటే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తడా?” అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
పంద్రాగస్టులోపు రుణ మాఫీ చేసి శనీశ్వరరావును సిద్దిపేటలో పాతరేస్తానని హరీశ్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ నెల 9లోపు ఆసరా పెన్షన్లను జమ చేస్తామని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం మాట్లాడారు. ‘‘డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టొడు కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడినపెడ్తున్నడు. కానీ, కేసీఆర్ మాత్రం తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నడు” అని మండిపడ్డారు.
నయవంచనకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబం
కేసీఆర్ నక్కజిత్తులను ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఒక మనిషిని దుష్టుడు, దుర్మార్గుడు అని ముందుగానే గుర్తించిన ఖమ్మం ప్రజల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. నమ్మించి మోసం చేయడంలో, నయవంచనలో కేసీఆర్ కుటుంబాన్ని మించినవాళ్లు లేరు. నామా నాగేశ్వర్రావు చెవిలో కేసీఆర్ పూలు పెడ్తున్నడు” అని వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్ఎస్ కారు కరాబై కార్ఖానాకు పోయింది. దాన్ని పాత ఇనుప సామాన్లకు అమ్ముకోవడమే మిగిలింది” అని అన్నారు. కేసీఆర్ పనైపోయిందని, తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ లేదని తెలిపారు. ‘‘ పదేండ్లు దోచుకున్న కేసీఆర్‌కు మెదడు దొబ్బింది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. ఇక్కడ కారు గుర్తుపై ఓట్లు వేయించుకొని ఢిల్లీలో బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న ఘనత కేసీఆర్‌దే. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే. వాటి మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. అందుకే పెద్ద నోట్ల రద్దు మొదలు వ్యవసాయ నల్ల చట్టాల వరకు కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది” అని ఆయన అన్నారు.
బీజేపీకి కర్రు కాల్చి వాత పెడ్తరు
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇచ్చింది ఏమీ లేదని, గాడిద గుడ్డు అని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడ్తరు. విభజన చట్టంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా, ఐటీ కారిడార్, ఐఐఎం, ఐఐఐటీ ఇవ్వాలని ఉన్నా ఏ ఒక్కటీ బీజేపీ ఇవ్వలేదు. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలి?” అని ఆయన ప్రశ్నించారు.
ఉద్యమ స్ఫూర్తిని చాటాలి
తెలంగాణ ఉద్యమం పాల్వంచ నుంచే మొదలై దేశానికి దిక్సూచిగా మారిందని సీఎం తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని ఆయన అన్నారు. ‘‘2014, 2018, 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు గానూ ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు ఇచ్చి బీఆర్ఎస్కు ఇక్కడి ప్రజలు బుద్ధిచెప్పారు. ఇప్పుడైతే ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు” అని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రామసహాయం రఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్‌ను దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశంలోనే అత్యధికంగా 3 లక్ష వరకు మెజార్టీ ఇక్కడి నుంచే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తల దూర్చనని అన్నారు. ‘‘ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయని గతంలో వైఎస్సార్ తనకు చెప్పినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ నాతో ఓ సందర్భంలో అన్నారు. ఇక్కడ ఎవరికి వారే నాయకులు, కార్యకర్తలు. నాడు జై తెలంగాణ నినాదంతో ప్రపంచం ముందుకు ఖమ్మం వచ్చింది. రైతులు, రైతు కూలీలు, కార్మిక హక్కుల కోసం చేసే పోరాటాలు ఖమ్మం నుంచే మొదలవుతాయి. దేశ తొలి ప్రధాని నెహ్రూ కన్నా తెలంగాణకు చెందిన రావి నారాయణరెడ్డికి దేశంలోనే అత్యధిక మెజార్టీ వచ్చింది. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు దేశంలోనే అత్యధిక మెజార్టీ ఖమ్మం నుంచే వస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ అరెస్టుకు బీజేపీ కుట్ర: భట్టి
కాలం చెల్లిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లను పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణిని నాశనం చేసేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నించిందని మండిపడ్డారు. కార్మికుల ప్రయోజనాలను విస్మరించిందన్నారు. కొత్త మైన్స్ తీసుకురావడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని.. కార్మికుల సంఖ్య భారీగా తగ్గిందని తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కార్మికులకు కల్పించామని ఆయన తెలిపారు. పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ కర్మాగారాన్ని తెరిపించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ‘‘మాయమాటలతో మోసం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీకి ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. రిజర్వేషన్ల రద్దు కోసం బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నరు. అక్రమ కేసులతో సీఎం రేవంత్‌ను అరెస్టు చేయాలని బీజేపీ నేతలు చూస్తున్నరు” అని ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్లు ఉండాలంటే, విభజన చట్టంలోని హామీలు అమలు కావాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఈ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, రాజ్యసభ మెంబర్ రేణుకా చౌదరి, సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ చీఫ్ కోదండరాం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎవర్ని చెప్పుతో కొట్టాలో బీజేపీ వాళ్లే చెప్పాలి
‘‘రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నవాళ్లను చెప్పుతో కొట్టాలన్న ఆ పార్టీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్.. ఇప్పుడు ఎవర్ని చెప్పుతో కొట్టాలో చెప్పాలి” అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీకి ఓట్లేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని, కాంగ్రెస్‌కు ఓట్లేస్తే రిజర్వేషన్లు పెరుగుతాయని ఆయన అన్నారు. పదేండ్లు బీజేపీ, బీఆర్ఎస్ ప్రజా ధనాన్ని దోచుకున్నాయని మండిపడ్డారు. ‘‘గుజరాత్ ను ఓడిద్దామా...తెలంగాణను గెలిపించుకుందామా’’ అంటూ సభలో కార్యకర్తలను ఆయన ఉత్సాహపరిచారు.