- కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
- ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయండి
- జిల్లా పరిస్థితులకు తగ్గట్టు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రూపొందించండి
- ఆగస్టు 15లోగా ధరణి దరఖాస్తులన్నీ పరిష్కరించాలి
- -రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి
- జియోట్యాగింగ్‌తో ప్రభుత్వ భూములు, చెరువులను రక్షించండి
- లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు రాజీపడొద్దు
- సెక్రటేరియెట్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: విద్య, వైద్యంపై కలెక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టాలని, స్కూళ్లను, హాస్పిటళ్లను రెగ్యులర్‌గా విజిట్చేస్తూ లోటుపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 15లోగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని డెడ్‌లైన్ విధించారు. ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడేందుకు జియో ట్యాగింగ్ చేయాలని, అవసరమైతే కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.
మంగళవారం సెక్రటేరియెట్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 9 పాయింట్ల ఎజెండాతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల దాకా సుదీర్ఘంగా సాగిన ఈ రివ్యూలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించారు. వివిధ స్కీమ్‌ల అమలుద్వారా ప్రజాప్రయోజనాలను సాధించాలని జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.
కీలకమైన ఎడ్యుకేషన్, హెల్త్‌పై స్పెషల్ ఫోకస్పెట్టాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్య అత్యంత కీలకం. అందుకే రాష్ట్ర సర్కారు చదువుకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి నెలా రూ.85 వేలు ఖర్చు పెడుతున్నది. పిల్లలతోపాటు దేశ భవిష్యత్తును నిర్దేశించే సర్కారు విద్యా వ్యవస్థను సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత కలెక్టర్లదే’ అని అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు.
రెగ్యులర్‌గా స్కూళ్లను, హాస్పిటళ్లను విజిట్‌చేసి లోటుపాట్లను సరిదిద్దాలని సూచించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రజలతో మాట్లాడాలని, చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయడంతోపాటు డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు తరచూ విజిట్ చేసేలా చూడాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మరింత మెరుగ్గా అందించేందుకు హరేకృష్ణ మూవ్ మెంట్ వంటి సంస్థల సహకారం తీసుకునే అంశంపై స్టడీ చేయాలని సూచించారు. ‘ప్రభుత్వాసుపత్రుల నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్థానికంగా స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు సేకరించాలి. వ్యాపారులు, వాణిజ్యవేత్తలను భాగస్వాములుగా చేసి ఆసుపత్రులను మెరుగుపరచాలి.
అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలి. మిగతా డాక్టర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలి.’ అని సీఎం సూచించారు. గ్రామాల్లో వైద్య సేవలందించే ఆర్ఎంపీలు, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్స్ అందజేయాలనే డిమాండ్ ను పరిశీలించాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా చూడాలని, రూరల్ ఏరియాల్లో పనిచేసే డాక్టర్లకు ప్రత్యేక పారితోషికాలు అందించి ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, ఇందుకు కలెక్టర్ల సహకారం ఎంతో అవసరమని చెప్పారు.
ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్‌తో చెరగని ముద్రవేయాలె
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు చేరవేసే కీలక బాధ్యత కలెక్టర్లదేనని సీఎం రేవంత్చెప్పారు. ఆయా జిల్లాలో ఉన్న వ న రులు, ప్రాంత ప రిస్థితుల ఆధారంగా ప్రతి కలెక్టర్ ఒక్కో ఫ్లాగ్ షిప్ కార్యక్రమానికి రూప కల్పన చేసి, అమ లు చేయాల ని సూచించారు. ఆయా కార్యక్రమాల పై కలెక్టర్ల ముద్ర స్పష్టంగా ఉండాలని అన్నారు. జాతీయ రహదారులకు భూసేకరణలో జాప్యం జరుగుతుండడంతో వ్యయం పెరుగుతున్నదని, సంక్షేమంతోపాటు అభివృద్ధిపైనా దృష్టి సారించాలని సూచించారు. జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రుల కార్యక్రమాలకు సరైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.
కలెక్టర్లు ఏ జిల్లాలో పని చేసినా.. అక్కడి జిల్లా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని, తాము పని చేసే ప్రాంత ప్రజలందరి అభిమానాన్ని అందుకునేలా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల టీచర్లు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు వాళ్లకు అడ్డుపడి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు మీడియాలో చూసినట్టు సీఎం చెప్పారు. జిల్లాల్లో కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితీరు ఉండాలని అన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లేనని సీఎం తెలిపారు.
ఇటీవలే రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలెక్టర్ల బదిలీలు చేపట్టామని అన్నారు. ఐఏఎస్‌లు విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి భాష నేర్చుకుంటే సరిపోదని, భాషతోపాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఐఏఎస్‌లు పని చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని, కేవలం ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదని చెప్పారు. తాము చేపట్టే ప్రతి పని.. ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలని పేర్కొన్నారు.
ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలె
పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొంద రగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి 15 వరకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇప్పటికే ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించింది. కొత్తగా 1,15,308 దరఖాస్తు చేసుకున్నారు’ అని సీఎంకు అధికారులు వివరించారు. కాగా, దరఖాస్తులను తిరస్కరిస్తే వాటికి కారణాలు తెలపాలని సీఎం సూచించారు. ధరణిలో పలు సాంకే తిక సమస్యల పరిష్కారానికి కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చే అంశం పరిశీలించాలని అన్నారు. ఆగస్టు 15లోగా పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని గడువు నిర్ణయించినట్టు చెప్పారు.
మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సులు..
మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ ప్రక టించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ చెప్పారు.
కలెక్టర్లు మరింత పనిచేయాలి..
‘‘గతంలో 10 పెద్ద జిల్లాలుండేవి. అప్పడు పది మంది కలెక్టర్లే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జిల్లాల పరిధి, జనాభా తగ్గిపోయింది. కలెక్టర్ల అధికారాలు, బాధ్యతల్లో తేడా ఏమీ లేదు. అప్పుడు పది మంది చేసిన పనిని ఇప్పుడు 33 మంది కలెక్టర్లు కలిసికట్టుగా ఎందుకు చేయలేరు? ఎవరికి వారుగా మీ ఆలోచనలు, మీ పనితీరును సమర్థతను చాటుకోవాలి.
ఇది ప్రజా ప్రభుత్వం. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు విశ్వాసం కల్పించే బాధ్యత మీదే’ అని కలెక్టర్లకు సీఎం మార్గదర్శనం చేశారు. కలెక్టరేట్లలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్‌లో ప్రజాభవన్ కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని, అదే మీ పనితీరు కు అద్దం పడుతుందని అన్నారు. 6 గ్యారంటీలను పార దర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని చెప్పారు. ప్రజల సంక్షేమంతోపాటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
అటవీ భూముల్లో పండ్లు, ఔష ధ మొక్కలు
అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడం వల్ల ఓ వైపు గిరిజనులకు ఆదాయం, మరో వైపు పచ్చదనం పెంపొందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయప డ్డారు. గిరిజనులకు ఆదాయం లేకనే పోడు వ్యవ సాయంపై ఆధార పడుతున్నారని, వారికి పట్టాలు ఇచ్చిన భూముల్లో మామిడి, సీతాఫలం, జామ వంటి పండ్ల మొక్కలు నాటిస్తే సీజన్ల వారీగా పండ్ల ద్వారా ఆ కుటుంబాలకు ఆదాయం వస్తుందని చెప్పారు. 3 నుంచి 4 ఏండ్లలో పంట వ చ్చే హైబ్రీడ్ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాల ని సూచించారు. పలు అటవీ ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూమి ఖాళీ ఉందని, డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేయించాలని అన్నారు. అనంతరం అక్కడ భూసార పరీక్షలు చేయించి, ఆ నేలల్లో పెరిగే పండ్ల మొక్కలు నాటించాలని ఆదేశించారు.
తద్వా రా కోతుల సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ‘వికారాబాద్ హవా.. టీబీకా దవా’ అనే (వికారాబాద్ గాలి.. టీబీకి మందు) నానుడి ఉందని, కానీ ఇప్పుడు వికారాబాద్ అటవీ ప్రాంతం చాలా వర కు ఖాళీగా ఉందని తెలిపారు. అక్కడ గతంలోలాగా ఔషధ మొక్కలు నాటించాలని ఆదేశించారు. పులుల స ఫారీకి తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాట కులు మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతానికి వెళ్తు న్నారని, మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలోనూ అటవీ ప్రాంతం ఉన్నా పులులు సంచారం లేదని, వాటికి అవసరమైన ఆవాసం, నీటి సౌకర్యం కల్పిస్తే అటవీ పర్యాటకం పెంపొందించ వచ్చని అన్నారు.
వన మహోత్సంలో మనం నాటే మొక్కలు 50 ఏండ్లపాటు ఫలసాయం అందించేలా ఉండాలని సీఎం అన్నారు. కలెక్టర్లు నెలకోసారి అటవీ ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారు. గతంలోలాగా ప్రభుత్వ భూమి లభ్యత లేనందున ప్రాజెక్టు కట్టలు, కాలువ కట్టలు, రహదారుల వెంట తాటి, ఈత చెట్లు నాటాలని, మూడు, నాలుగేండ్లలో గీత వృత్తిదారులకు ఆదాయం వచ్చేలా హైబ్రీడ్ మొక్కలు నాటాలని ఆదేశించారు.
పీరియాడికల్ క్రైమ్ రివ్యూ చేయాలి
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడొద్దని పోలీసు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే కానీ.. నేరస్థులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. పబ్స్ విషయంలో టైమింగ్ పెట్టొచ్చని, ఆంక్షల పేరుతో రాత్రి వేళ్లల్లో స్ట్రీట్ ఫుడ్ పెట్టుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ లకు సీఎం సూచించారు. ఐటీ రంగంలోని వారు రాత్రి వేళల్లో పని చేయాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.
పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూ చేయాలని, కమిషనర్లు, ఎస్పీలు మొదలు ఎస్ హెచ్ వోల వరకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. నిరుడి కన్నా నేరాలు తగ్గాయని పోలీసు అధికారులు వివరించగా.. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు. డ్రగ్స్‌తో పట్టుపడిన వారిని డీఅడిక్షన్ సెంటర్లో ఉంచాలని, ఇందుకోసం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో కొంత భాగాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్చిన్నారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశాన్ని ప్రారంభించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభోపన్యాసం చేశారు.సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీని రేషన్‌కార్డుతో లింకు పెట్టొద్దు
ఆరోగ్యశ్రీని రేషన్‌కార్డుతో లింకు పెట్టొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ‘గత సర్కారు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వకుండా వైద్యసేవల కోసం రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంది. దీంతో చాలా మంది రేషన్ అవసరం లేకున్నా కేవలం ఆరోగ్యశ్రీ కోసం రేషన్ కార్డులు కావాలని ఎగబడుతున్నారు. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడ్తున్నది. అందుకే రేషన్‌కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను సెపరేట్‌గా ఇద్దాం. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయండి.’ అని కలెక్టర్లకు సీఎం రేవంత్సూచించారు..
ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కరికీ అందాలి
ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘా టించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలు అందని అర్హుల కోసం ఆధార్, రేషన్ కార్డు లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్లు సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని సీఎం తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు పని చేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవాకేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు గృహజ్యోతికి 5.89 లక్షల మంది, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకానికి 3.32 లక్షల మంది సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు స్థలాలు ఎంపిక చేయండి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు ఒకే చోట ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో రహదారులకు అనుసంధానంగా ఉండే గ్రామాలు, పట్టణాల్లో వాటికి స్థలాల ఎంపిక చేయాలని సీఎం సూచించారు. ఎవరు ముందుగా స్థలాలు ఎంపిక చేస్తే వారికి వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) అప్ గ్రేడ్ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. కలెక్టర్లు తమ పరిధిలోని ఐటీఐలను సందర్శించి, వాటిని ఏటీసీలుగా మార్చే ప్రక్రియ ఎలా సాగుతుందో పరిశీలించాలని ఆదేశించారు.
కల్తీ విత్తనాల విషయంలో కఠినంగా ఉండాలి: మంత్రి తుమ్మల
కల్తీ పురుగు మందులు, ఎరువులు, విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహ రించాలని కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు, యూరియా సిద్ధంగా ఉన్నాయని, సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే కలెక్టర్లు జాగ్రత్త వహించాలని అన్నారు. కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారని, అటువంటివి జరగకుండా జాగ్రత్త పడాల ని హెచ్చరించారు.