ఆన్లైన్లో లేకుండా అనుమతులెట్ల ఇచ్చిన్రు? : సీఎం రేవంత్రెడ్డి

ఆన్లైన్లో లేకుండా అనుమతులెట్ల ఇచ్చిన్రు? : సీఎం రేవంత్రెడ్డి
  • బిల్డింగ్ పర్మిషన్ల ఫైల్స్ ఏమైనయ్: సీఎం రేవంత్
  • చెరువుల డేటా ఎందుకు డిలీట్ అవుతున్నది?  
  • హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీలో విజిలెన్స్ దాడులు జరుగుతయ్
  • అక్రమ అధికారులు ఇంటికి పోతరని హెచ్చరిక
  • త్వరలో మెట్రో మార్గాలకు శంకుస్థాపన చేస్తమని వెల్లడి

హైదరాబాద్‌, వెలుగు: జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలో బిల్డింగ్ ప‌ర్మిష‌న్ల ఫైల్స్ క్లియ‌ర్‌గా ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హెచ్ఎండీఏ కార్యాల‌యంలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. చాలా బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించిన ఫైల్స్ క‌నిపించ‌డం లేదని, ఆన్‌లైన్​లో లేకుండా ఇష్టారీతిన ప‌ర్మిష‌న్లు ఎలా ఇచ్చారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాలని ఆదేశించారు. 15 రోజుల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయని చెప్పారు. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులు ఇంటికి పోతారని హెచ్చరించారు. హెచ్ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల డేటా ఎందుకు డిలీట్ అవుతున్నదని అధికారులను సీఎం ప్రశ్నించారు. 3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనని, చెరువులు ఆక్రమ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్షణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కమిషనర్లను నియమించండి.. 

హైద‌రాబాద్ లో పిల్లల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ రామ‌కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడి.. గ్రూప్ 1 అధికారులు క‌మిష‌న‌ర్లుగా ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. కొత్త కార్పొరేష‌న్లకు ఐఏఎస్‌ల‌ను క‌మిష‌న‌ర్లుగా నియ‌మించాల‌ని సూచించారు.

మున్సిపాలిటీల్లో ప‌నిచేసే మున్సిప‌ల్ వ‌ర్కర్లకు ప్రమాద బీమా క‌ల్పించ‌డంపై అధ్యయ‌నం చేయాల‌న్నారు. జీహెచ్ఎంసీలో వ‌య‌సు పైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని సూచించారు. ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించేందుకు అధ్యయ‌నం చేయాలన్నారు. హైద‌రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌న్నారు.

జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఉదయమే లేచి కాలనీల్లో పర్యటించాలని, లేదంటే ఇంటికి వెళ్లిపోవ‌చ్చని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్రక‌ట‌న‌ల బోర్డు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. కాగా, హైదరాబాద్ లో విలువైన ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. త్వరలోనే మెట్రో కొత్త మార్గాలకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు.

తాగునీళ్లకు ఇబ్బంది ఉండొద్దు.. 

హైద‌రాబాద్​లో తాగు నీటి కొర‌త లేకుండా చూడాల‌ని అధికారులను రేవంత్‌ ఆదేశించారు. స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. మ‌ల్లన్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీరు స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.