రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ: సీఎం రేవంత్రెడ్డి

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ:  సీఎం రేవంత్రెడ్డి

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.  ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు 1, 2 రోజు ల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీ లించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ పై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నందున ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. 

సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ISB తరహాలో బోర్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది. మీటింగ్ హాజరైన ప్రతినిధులందరినీ  తాత్కాలిక బోర్డుగా భావించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. స్కిల్ యూనివర్సిటీలో ఏయే కోర్సులుండాలి, ఎలాంటి కరిక్యులమ్ ఉండాలో అధ్యయనం చేయాలని చెప్పారు. 

ప్రజలకు అధునాతన పరిజ్ఞానం అందించేలా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు సీఎం రేవంత్. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.  

కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున,  ప్రతీ అయిదు రోజులకోసారి సమావేశం కావాలని అధికారులు, పారిశ్రామికవేత్తలకు సూచించారు సీఎం రేవంత్. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో  స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా.. ప్రభుత్వమే  ఈ బాధ్యతలను చేపట్టాలా?... మరేదైనా విధానం అనుసరించాలా.. అనేది కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్ ను నియమిం చుకోవాలని  సీఎం చెప్పారు. ఈ యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్టుమెంట్ గా ఉంటుందని తెలిపారు.