- ఐఐటీ హైదరాబాద్‌తో స్టడీ చేయించాలి
- నెల రోజుల్లో రిపోర్ట్ వచ్చేలా చూడాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అధ్యయనం చేయించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం హైదరాబాద్ ఐఐటీకి చెందిన నిపుణులతో టీమ్‌ను ఏర్పాటు చేసి నెల రోజుల్లోగా నివేదిక ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సెక్రటేరియెట్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఐఐటీ హైదరాబాద్ టీమ్‌తో కో ఆర్డినేట్ చేసుకునేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజె క్టు బ్యాక్ వాటర్‌తో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయించాలన్నారు. కాగా, 2022లో గోదావరికి 27 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చినప్పుడు భద్రాచలం గుడి మునిగినట్టు సీఎంకు అధికారులు వివరించారు. వాస్తవానికి పోలవరం ముంపు సమస్యపై అధ్యయనం చేయించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాయింట్ సర్వేకు ఆదేశించింది. జాయింట్సర్వేలో భాగంగా కేంద్ర అధికారులు, తెలుగు రాష్ట్రాల అధికారులతో కలిసి ముంపు ఉండే ప్రాంతాలపై అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ నెల 2 నుంచే సర్వే
ప్రారంభం కావాల్సి ఉండగా.. 15వ తేదీకి వాయిదా పడింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర అధ్యయనానికి ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బనకచర్లను అడ్డుకోండి
ఏపీ కొత్తగా చేపట్టబోతున్న గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. అందులోని అంశాలపై తెలంగాణ అభ్యంతరాలు తెలి యజేయాలని సూచించారు. ఏపీ తలపెట్టిన ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులూ లేవని, వరద జలాల ఆధారంగా ప్రాజెక్టును చేపట్టారని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి శాఖకూ లేఖలు రాయాలని సీఎం ఆదేశించారు.