కోడ్​ లేని జిల్లాల్లో కొత్త రేషన్​ కార్డులు .. అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం

కోడ్​ లేని జిల్లాల్లో కొత్త రేషన్​ కార్డులు .. అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం
  • జారీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం
  • కోడ్​ ముగియగానే మిగిలిన జిల్లాల్లోనూ పంపిణీ
  • కార్డు కోసం ఒక్కసారి అప్లై చేస్తే చాలు.. మళ్లీ మళ్లీ చేయొద్దు
  • ఈ విషయంలో ప్రజలకు ఆఫీసర్లు అవగాహన కల్పించాలి
  • దరఖాస్తుల వెరిఫికేషన్​ను స్పీడప్​ చేయాలని సూచన
  • ఉగాది నుంచి సన్నబియ్యం సరఫరా!

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కోడ్ లేని జిల్లాల్లో కార్డుల జారీని వెంటనే ప్రారంభించాలన్నారు. కోడ్​ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ జారీ చేయాలని సూచించారు. సివిల్​ సప్లై విభాగంపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డితో కలిసి సీఎం రేవంత్​ సోమవారం కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో సమీక్షించారు. రేషన్​ కార్డుల కోసం ప్రజాపాలన, గ్రామ సభలు, మీ–సేవ కేంద్రాల ద్వారా  వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్​ స్పీడ్​గా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

 అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశమిచ్చినప్పటికీ  మీ–సేవ కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం జనం ఎందుకు క్యూ కడ్తున్నారని ఆయన ఆరా తీశారు. దరఖాస్తు చేసినవారే మళ్లీ మళ్లీ వస్తున్నారని, అందుకే రద్దీ ఉంటున్నదని అధికారులు తెలిపారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదని, ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా  కొత్త కార్డులు జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కార్డుల కోసం ఒకసారి దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆఫీసర్లకు సూచించారు. కొత్త రేషన్​ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. 

సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు

రివ్యూలో భాగంగా సన్నబియ్యం పంపిణీపైనా సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించినట్లు తెలిసింది. ఉగాది లేదంటే ఏప్రిల్​లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సివిల్​ సప్లై ఆఫీసర్లను ఆదేశించినట్లు సమాచారం.

రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. 2 కోట్ల 81 లక్షల71వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇక కొత్తగా 10 లక్షల రేషన్​కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు. ఈ లెక్కన మరో 30 లక్షల మంది పెరిగినా.. ఏటా పంపిణీకి దాదాపు 22 లక్షల టన్నుల నుంచి 24 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా వేస్తున్నారు. వానాకాలం ప్రభుత్వం 24 లక్షల టన్నుల సన్నవడ్లను రైతుల నుంచి సేకరించింది. వీటిని మరాడిస్తే గరిష్టంగా 15 లక్షల టన్నుల బియ్యం వచ్చే అవకాశముంది. ఇప్పటికే  సివిల్​ సప్లయ్​శాఖ ఆధ్వర్యంలో సన్నవడ్లను మరాడించే కార్యక్రమం వేగంగా సాగుతున్నది.  మరో 5 లక్షల టన్నులను అవసరమైతే  ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే అంశంపైనా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. వాస్తవానికి సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ, వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను కనీసం రెండు మూడు నెలలైనా మాగనిచ్చి మిల్లింగ్‌ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించడంతో.. రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మార్చి చివరలో లేదా ఏప్రిల్​లో ప్రారంభించాలని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. సన్న బియ్యం పంపిణీ చేస్తే దొడ్డు బియ్యం రీసైక్లింగ్ కు అడ్డుకట్టపడ్తుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రేషన్‌కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపని కొందరు ఆ బియ్యాన్ని కిలో రూ.10 నుంచి 20 చొప్పున దళారులకు అమ్మేసుకుంటున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్‌ మిల్లులకే చేరుతున్నాయి. ఆయా మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి కస్టమ్‌ మిల్లింగ్‌ కింద తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. రేషన్‌ కింద సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే ప్రజలు వాటిని తినేందుకు వాడుకుంటారని, దీంతో రేషన్​ బ్లాక్‌ మార్కెట్‌ సమస్య కూడా తీరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.