- హైదరాబాద్ చెరువుల పరిస్థితిపై నివేదిక సమర్పించండి : సీఎం రేవంత్‌రెడ్డి
- కబ్జాల వల్ల నష్టాలేంటో తెలిసేలా రిపోర్టులు అందజేయాలి
- జీవో 111, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులనూ ప్రస్తావించాలి
- జీఐఎస్ డిజిటల్ మ్యాపింగ్‌తో అక్రమ నిర్మాణాలను గుర్తించాలి
- అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్మహానగరంలో గత కొన్నేండ్లలో మాయమైన చెరువులు, ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు, తద్వారా వస్తున్న సమస్యలపై హైకోర్టుకు నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. చెరువులను కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేస్తుండడంతో అక్రమార్కులు మంత్రులపై ఒత్తిడి తెచ్చి, ఆపేందుకు ప్రయత్నించారు. సాధ్యంకాకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కేటీఆర్‌దిగా భావిస్తున్న జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చివేయొద్దంటూ బీఆర్ఎస్ లీడర్ ఒకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, హైదరాబాద్తాగునీటి అవసరాలు తీరుస్తున్న జంట జలాశయాలు, ఎఫ్ టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, కుంచించుకుపోయిన ఫీడింగ్చానళ్లు, జీవో 111, గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు లాంటి వివరాలన్నింటిపై నివేదికలు తయారుచేసి, హైకోర్టుకు అందజేయాలని ఉన్నతాధికారులకు సీఎం బుధవారం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఒక్క హైదరాబాద్ లో దాదాపు 56 చెరువులు మాయం అయ్యాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయని, ఆ వివరాలను కోర్టుకు అదనపు సమాచారం కింద అందజేయాలని సీఎం చెప్పినట్టు సమాచారం.
గొలుసుకట్టు చెరువులు, వాటి వరద కాల్వలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల కొన్నేండ్లుగా హైదరాబాద్‌లోని అనేక కాలనీలు, ఇండ్లు ఎలా నీటమునుగుతున్నదీ ఫొటోలతో సహా కోర్టుకు స్పష్టం చేయాలని సీఎం సూచించినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. సీఎం ఆదేశాలమేరకు జంట జలాశయాలు, 111 జీవో విషయంపైనా కోర్టుకు వివరాలు అందజేయాలని, ఇందుకు సంబంధించి గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కూడా కోర్టు ముందు ఉంచాలని సీఎం సూచించినట్టు తెలిపారు.
హైడ్రాకు మరిన్ని పవర్స్!
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఒకవేళ కోర్టు ఏదైనా అభ్యంతరం చెబితే.. ప్రభుత్వం వైపు నుంచి ఆ అభ్యంతరం పూడ్చేలా హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులతో సీఎం అన్నారు. కొంతమంది మంత్రులకు, సీఎంవోకు కూడా హైడ్రా కూల్చివేతలు ఆపాలంటూ ఫోన్లు వచ్చాయని, తమ లక్ష్యం హైదరాబాద్‌ను కాపాడుకోవడమేనని సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. మరోవైపు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో అక్రమ కట్టడాల బాగోతాన్ని కోర్టులతోపాటు ప్రజల ముందు కూడా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తద్వారా కొందరు నేతల బండారం కూడా బట్టబయలు చేసినట్టు అవుతుందని భావిస్తున్నది. ప్రస్తుతం ప్రజల నుంచి వచ్చిన కంప్లయింట్స్ఆధారంగానే హైడ్రా, మున్సిపల్కార్పొరేషన్లు అక్రమ నిర్మాణాలు కూల్చేయిస్తున్నాయి. అలాకాకుండా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను జీఐఎస్డిజిటల్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి, కూల్చివేతలు చేపట్టే విషయాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఇందుకోసం ఒక ఏరియాను పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.