
- హైదరాబాద్– రాయ్‌పూర్,హైదరాబాద్– మంచిర్యాల హైవేలకు ప్రతిపాదనలు
- ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం భూసేకరణ,దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ పూర్తి చేయాలి
- భూ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వందేండ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సమీపంలో డ్రైపోర్ట్ ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ను చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు తయారుచేసి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు (ఎన్‌హెచ్ఏఐ) పంపించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతి పాదనలు తయారు చేయాలన్నారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, ఆర్ఆర్ఆర్ పనుల పురోగతిపై కమాండ్ కంట్రోల్‌సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం రివ్యూ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్-– విజయవాడ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం డీపీఆర్ తయారీకి ఆమోదం తెలపాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. ఇటీవల రాష్ట్ర పునర్విభజన అంశాలపై ఢిల్లీలో జరిగిన తెలంగాణ, ఏపీ అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రిపుల్ఆర్ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని తెలిపారు. దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ నివేదికను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
భూ సేకరణలో సమస్యలుంటే కలెక్టర్లతో మాట్లాడాలి
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం ఆరా తీశారు. పలు చోట్ల పంటలు ఉన్నాయని, పంట నష్ట పరిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్ఏఐ అంగీకరించడం లేదని అధికారులు సీఎంకు వివరించారు. పంట కాలం దాదాపు పూర్తవుతున్నందున ఆ వెంటనే రైతులతో మాట్లాడి భూ సేకరణ పూర్తి చేయాలని తెలిపారు. భూ సేకరణలో ఏవైనా సమస్యలుంటే ఆయా కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలని, సాంకేతిక, న్యాయ సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని సీఎస్ శాంతి కుమారికి సీఎం సూచించారు.
ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు రేడియల్ రోడ్లు.. ఆర్ఆర్ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న రహదారుల విస్తరణపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. సమీక్షలో సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ముఖ్య ఇంజనీర్లు తిరుమల, జయభారతి తదితరులు పాల్గొన్నారు.
నెక్లెస్‌రోడ్ లేక్‌వ్యూ పార్క్‌లో పూలే విగ్రహ ఏర్పాటుకు సీఎం స్థల పరిశీలన
సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు సర్కిల్ ఇందిరా గాంధీ విహ్రగం సమీపంలోని లేక్ వ్యూ పార్క్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ స్థాపన కోసం స్థలాన్ని పరిశీలించారు. పూలే జయంతి సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐమాక్స్ థియేటర్ ఎదురుగా ఉన్న పార్క్‌లో స్థలాన్ని సీఎం స్వయంగా పరిశీలించి, అధికారులతో చర్చించారు.
భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు లేదా ఇతర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడిన సీఎం, మహిళా విద్య, బడుగు-బలహీన వర్గాల ఉద్ధరణలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుంద న్నారు. అంతకుముందు, అంబర్‌పేటలోని పూలే విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.