
- విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
- భూసేకరణ, అనుమతులపై సీనియర్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టాలి
- గుర్తించిన స్థలాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ
- కొడంగల్, మధిర, హుజూర్ నగర్ లో మార్చి 20 నుంచి పనులు
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొడంగల్, మధిర, హుజూర్ నగర్లో ఈ స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, మార్చి 20న పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలియజేశారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం విద్యా శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తీసుకున్నారు. రెండేండ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వందశాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మిగతా నియోజకవర్గాల్లో భూసేకరణ, అనుమతుల ప్రక్రియను చూడాలని ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన సీనియర్ అధికారులకు సూచించారు.
నియోజకవర్గాల్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు అనువుగా ఉండే ప్రదేశాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఎంచుకోవాలన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి స్థలాల ఎంపికలో జాగ్రత్త వహించాలని ఆయన చెప్పారు. భూ సేకరణ, స్థలాల ఎంపికపై ప్రతి రెండు రోజులకోసారి సమీక్షించాలని, పది రోజుల్లోపే దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలన్నారు.
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మహిళా వర్సిటీలో నిర్మాణాలు
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర అవసరాల కోసం చేపట్టే నిర్మాణాలు యూనివర్సిటీల స్థాయిలోనే ఉండాలని.. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గదులు, ల్యాబ్‌లు, ప్లేగ్రౌండ్, ఇతర నిర్మాణాలు చేపట్టాలన్నారు. యూనివర్సిటీ నిర్మాణాలకు సంబంధించి నిధుల వ్యయానికి ప్రభుత్వం వెనుకాడదని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని చారిత్రక, పురాతన కట్టడాలను పరిరక్షించాలని, వాటికి అవసరమైన రిపేర్ల విషయంలో పురావస్తు శాఖ అధికారులతో చర్చించాలని సూచించారు.
నిర్మాణ ఆకృతులకు సంబంధించి పలు మార్పులపై చర్చించారు. సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంఆర్డీసీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.గౌతమి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ నరసింహారెడ్డి, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు.