
తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వడగండ్ల వాన అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల ఈదురు గాలులకు కరెంట్ స్తంబాలు, చెట్లు నేలకొరిగాయి. మరో రెండు రోజులు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో సంబంధిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్.. రానున్న 48 గంటలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ALSO READ | తెలంగాణలో పలు చోట్ల వడగండ్ల వాన.. మరో రెండు రోజులు అలర్ట్
ఉమ్మడి ఆదిలాబాద్,కరీంనగర్ ,నిజామాబాద్ ,మెదక్ జిల్లాలోని పలు చోట్ల మార్చి 21 సాయంత్రం నుంచే వడగండ్ల వాన పడుతోంది. కాగజ్‌నగర్ పట్టణం నౌగాంబస్తీలో ఇంటి గోడ కూలి దావులత్ (65) మృతి చెందాడు. పలు చోట్ల చేతికొచ్చిన పంట తడిసి ముద్దవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.