
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్.. మెరుగైన సౌలతులపై దృష్టి
- రద్దీ ప్రాంతాల్లో ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
- కోర్ అర్బన్ ఏరియాపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు : ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని సూచించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు.
నగరంలో ఇండ్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని చెప్పారు. వీటన్నింటిని సమీక్షిస్తేనే నగరంలో నివాస ప్రాంతాలకు మౌలిక సదుపాయాల విషయంలో అవసరాలకు తగిన విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే వీలుంటుందని అన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
Also Read :- కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్‌లో వాదనలు ఆపం
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి టెండర్ల ను పిలవాలని ఆదేశించారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస రాజు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, సీఎంవో అధికారి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.