![టూరిస్ట్ స్పాట్‌గా మీరాలం చెరువు .. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-orders-officials-to-study-more-on-new-flyovers_pksjgi136U.jpg)
- కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి 3 నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయాలి
- 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలి
- చెరువు చుట్టూ భారీ పార్క్ నిర్మాణానికి యోచన
- పురపాలక, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రివ్యూ
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్ల వెడల్పుపైన సీఎం పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాజెక్టులపై పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం రివ్యూ మీటింగ్నిర్వహించారు. మీరాలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి 3 నెలల్లో డీపీఆర్ తయారు చేసి, 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మీరాలం చెరువుపై సుమారు 2.42 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు మూడు ప్రతిపాదనలు సమర్పించారు. వాటికి పలు మార్పులు చేర్పులు సూచించిన సీఎం.. రెండు రోజుల్లో పూర్తి సమాచారంతో రావాలన్నారు.
మీరాలం బ్రిడ్జిని హైదరాబాద్‌లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పారు. హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణకు సంబంధించి పలు సూచనలు చేశారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
భారీ హంగులతో టూరిస్ట్ స్పాట్‌గా మీరాలం చెరువు
ఓల్డ్ సిటీలో జూ పార్కును అనుకొని ఉన్న మీర్ఆలం చెరువును పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. చెరువుపై మరో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి ని నిర్మించనుండగా.. ఇప్పటికే హెచ్ఎండీఏ అన్ని అనుమతులు మంజూరు చేసింది. కేబుల్ బ్రిడ్జ్ తోపాటు చెరువు చుట్టూ ఓ భారీ పార్కును నిర్మించేందుకు కూడా కార్యాచరణకు దిగింది. అయితే దీనికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేందుకు పీపీపీ విధాననంలో మరింత ఎక్కువ ఖర్చు చేసి, భారీ హంగులతో నిర్మించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
ఆర్నమెంట్ లైటింగ్, వ్యూ పాయింట్లు, చెరువులో మ్యూజికల్ ఫౌంటెయిన్లు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే ఆకృతుల ఏర్పాటు, మూడు పెద్ద దీవుల్లో టూరిస్టుల కోసం విడిది కేంద్రాలు, హోటల్స్ నిర్మాణం, మరో రెండు చిన్న దీవుల్లోనూ అద్భుతమైన పార్కులు, ఐదు దీవులను కలుపుతూ పైవంతెన మార్గాలు, చెరువు చుట్టూ గ్రీనరీ అభివృద్ధి, ఆటపాటలు, క్రీడా వసతులు కల్పించనున్నారు. మెుత్తం రూ.1900 కోట్లతో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి, పర్యాటక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.
మెుత్తం 2.5 కి.మీ పొడవుతో, నాలుగు లైన్లుగా 16.5 మీటర్ల వెడల్పుతో సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించాలని భావిస్తున్నారు. చెరువుకు వెస్ట్ వైపున ఉన్న దక్కన్ పార్కు నుంచి తూర్పున ఉన్న బెంగళూరు జాతీయ రహదారి మధ్య దీన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణం ద్వారా.. కిషన్‌బాగ్ నుంచి వంతెన పైకి ఎక్కేలా అప్ ర్యాంపు, దక్కన్ పార్కు నుంచి చింతల్‌మెట్ వైపు రోడ్డుకు వంతెన డౌన్ ర్యాంపు, జాతీయ రహదారి నుంచి బహదూర్‌పుర, అత్తాపూర్ వైపు నుంచి రాకపోకలు సులువుకానున్నాయి.