స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక కమిషన్
  • వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బీసీ కమిషన్​ను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని తేల్చిచెప్పారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ఇదే అంశంపై ఆదివారం మంత్రులు ఉత్తమ్ కుమార్​రెడ్డి,  శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్, ఉన్నతాధికారులతో జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో సీఎం రేవంత్​ రెడ్డి సమాలోచనలు జరిపారు. కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అంశాలను సమీక్షించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 340, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం బీసీల జనాభా లెక్కలు తీసేందుకు ప్రత్యేక(డెడికేటెడ్​) కమిషన్​ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం రేవంత్​రెడ్డి అభిప్రాయపడ్డారు.