
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంటి పరిసర ప్రాంతాలను సిటీ సీపీ సీవీ ఆనంద్ సోమవారం పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన ప్రదేశంతోపాటు తిరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డీకే అరుణ ఇంటితో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోని వీఐపీల ఇండ్ల వద్ద పటిష్టమైన నిఘా పెట్టాలని సీపీ సూచించారు. రాత్రిళ్లు నిరంతర పెట్రోలింగ్, నైట్ డ్యూటీ ఆఫీసర్ తనిఖీలు, పాయింట్ బుక్ తప్పని సరిగా అమలు చేయాలని డీసీపీ విజయ్‌కుమార్‌ను ఆదేశించారు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లోని డీకే అరుణ నివాసంలోకి ఆదివారం తెల్లవారుజామున ఆగంతుకుడు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ముసుగు ధరించిన వ్యక్తి సీసీటీవీ కెమెరాల వైర్లను కత్తిరించి ఇంట్లో సంచరించాడు. దాదాపు గంటన్నర పాటు డీకే అరుణ ఇంట్లో తిరిగాడు.
గతంలో డీకే అరుణ ఇంట్లో పనిచేసిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దుండగుడు రెండు ఆటోలు మారినట్లు గుర్తించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఐటీ వింగ్, టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌తో ఆగంతుకుడి కోసం గాలిస్తున్నామని డీసీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు.