ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లకు రెస్పాండ్ కండి..ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం

ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లకు రెస్పాండ్ కండి..ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం
  • వారి ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వండి
  • కలెక్టర్లకు, ఎస్పీలకు, ఇతర ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు
  • జిల్లాల్లో కోఆర్డినేషన్ మీటింగ్​లు పెట్టాలని మంత్రులకు సూచన
  • ఆ వెంటనే పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులతో ఐదుగురు మంత్రుల భేటీలు 

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి వచ్చే ఫోన్లకు, నియోజకవర్గాల్లో వివిధ పనులకు సంబంధించి వారిచ్చే ప్రతిపాదనలు, సిఫార్సు లేఖలకు వెంటనే స్పందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు సీఎంవో నుంచి ఫోన్ లు వెళ్లాయి.  తాము అధికార పార్టీ ప్రజాప్రతినిధులమైనా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారులు తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కొన్ని జిల్లాల్లో కేవలం మంత్రుల మెప్పు కోసమే అధికారులు పనిచేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వీరంతా గతంలో పార్టీ ఇన్​చార్జ్​గా పనిచేసిన దీపాదాస్ మున్షీ వద్ద, ఆ తర్వాత కొత్త ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర తరచూ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ దగ్గర తమ ఆవేదన వెలిబుచ్చుతూ వచ్చారు. కొన్ని జిల్లాల్లో పలువురు మంత్రుల తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. వివిధ  అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇస్తూ, ఇతర నియోజకవర్గాల్లో వేలు పెడ్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పైగా కొందరు మంత్రులు, ఇన్​చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల నడుమ సమన్వయం లేకపోవడం వల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ఈ సమన్వయలేమి వల్లే ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందనే వార్తలు వచ్చాయి. త్వరలోనే లోకల్​బాడీ ఎన్నికలు జరగనున్నందున.. ఇప్పుడైనా సమన్వయంతో ముందుకెళ్లకపోతే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​ కూడా ఇదే చెప్పడంతో ఎట్టకేలకు సీఎం రంగంలోకి దిగారు. 

ప్రజా ప్రతినిధులతో మంత్రుల మీటింగ్​లు 

జిల్లా స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ ఇన్​చార్జ్​లతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల మంత్రులను, ఇన్​చార్జ్ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలు అందగానే పలువురు మంత్రులు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో ఆ జిల్లా మంత్రి కొండా సురేఖ మినిస్టర్ క్వార్టర్స్​లోని తన ఇంట్లో శనివారం సమావేశమయ్యారు. ఆ వెంటనే జిల్లా అధికారులను పిలిచి వారితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో.. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. కేవలం మంత్రులతో ఆయా జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య సమన్వయం కోసమే ఈ మీటింగ్​లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇవి పూర్తిగా పార్టీ అంతర్గత సమావేశాలు అని నేతలు చెప్పడం విశేషం.