= ఏఐ ఆధారిత కేంద్రాన్ని నెలకొల్పేలా ఎస్టీటీ సంస్థ ఒప్పందం
= సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అగ్రిమెంట్
= డేటా సెంటర్ల క్యాపిటల్గా హైదరాబాద్
= సత్ఫలితాలనిస్తున్న సీఎం సింగపూర్ టూర్
హైదరాబాద్: తెలంగాణలో రూ. 3,500 కోట్లతో ఏఐ ఆధారిత గ్లోబల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సింగపూర్ కు చెందిన ఎస్టీటీ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ను పెట్టుబడుల స్వర్గధామం చేస్తామని అన్నారు.
హైదరాబాద్ డేటా సెంటర్ల రాజధానిగా మారబోతోందని చెప్పారు. డేటా సెంటర్ సొల్యూషన్స్ లో పేరొంది. ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముచ్చర్ల ప్రాంతంలోని మీర్జాఖాన్ పేటలో డేటా సెంటర్ అత్యాధునిక క్యాంపస్ స్థాపించేందుకు ఎంవోయూ చేసుకోవడం శుభపరిణామమన్నారు. రాబోయే డేటా సెంటర్ వంద మెగావాట్ల వరకు లక్ష్య సాధన సామర్థ్యతో అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నదని అన్నారు. ఇది దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలువబోతోందని చెప్పారు.
"హైదరాబాద్ త్వరలో డేటా సెంటర్ల రాజధానిగా అవతరిస్తుంది." అని అన్నారు. ఎస్టీటీ సీఈవో బ్రూనో లోపెజ్ మాట్లాడుతూ, డైనమిక్ రాష్ట్రంలో తమ ఉనికిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందని అన్నారు. ఏఐ నేతృత్వంలోని డిజిటల్ విస్తరణలో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ కంపెనీ పదేండ్లలో మన దేశంలో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. దశాబ్దంలో ఈ కంపెనీ దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని అంచనా.