నవంబర్ 8న సీఎం రేవంత్ పాదయాత్ర

నవంబర్ 8న సీఎం రేవంత్ పాదయాత్ర

* మూసీ వెంట నడవనున్న రేవంత్ రెడ్డి
* బీబీనగర్–వలిగొండ మధ్య 6 కి.మీ నడక
* కాలుష్య పరిస్థితిని ప్రజలకు చెప్పేందుకే 
* స్థానిక లీడర్ల కోరిక మేరకు నిర్ణయం.. కాసేపట్లో రూట్ మ్యాప్
* యాదాద్రి దర్శనం తర్వాత వలిగొండ మండలం సంగెం గ్రామానికి సీఎం

హైదరాబాద్: మూసీ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న పాదయాత్ర చేయనున్నారు. వలిగొండ–బీబీనగర్ మధ్య ఆరు కిలోమీటర్ల మేర మూసీ వెంట నడుస్తూ అక్కడి కాలుష్యం పరిస్థితిని ప్రజలకు వివరించనున్నారు. మూసీ పునరుజ్జీవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందు కోసం ఇటీవలే మంత్రులు పొంగులేటి, పొన్నం, భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి, హైదరాబాద్ నగర్ మేయర్ తో కూడా పలువురు ప్రజాప్రతినిధులతో కూడిన బృందాన్నిసియోల్ పంపారు. అక్కడ సిటీ మధ్యలో ప్రవహించే నదిని ఎలా పునరుద్ధరించారో చూసి అధ్యయనం చేసి వచ్చింది. 

తొలి దఫాలో 21 కిలోమీటర్ల మేర మూసీ నదిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది.. హైదరాబాద్లోని మురికి నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలను కలుపుకొని అధ్వాన స్థితిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కాలుష్యంతో కూడిన ఆ నీటి కారణంగా పరీవాహక ప్రాంతంలో పంటలు కూడా పండని దుస్థితి ఏర్పడిందని పలుమార్లు సీఎం చెప్పారు.

 

పశువుల పాలు కూడా ఎర్రగా వస్తున్నాయని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టేందుకు, ప్రజలకు వాస్తవ పరిస్థితిని, ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విడమర్చి చెప్పేందుకు సీఎం సిద్ధమయ్యారు. మూసీ పునరుద్ధరణ తర్వాత మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకొచ్చి నింపి స్వచ్ఛమైన నీటిని నదిలో పారించాలనే తలంపుతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవం ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ బాట పట్టనున్నారు.

బర్త్ డే రోజే పాదయాత్ర
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. అదే రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. హెలికాప్టర్ లో సీఎం యాదగిరి గుట్టకు చేరుకుంటారని తెలుస్తోంది. ఇందుకోసం చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. హెలిప్యాడ్ ను కూడా సిద్ధం చేశారు. స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం రోడ్డు మార్గం గుండా వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకొని పాదయాత్ర ప్రారంభిస్తారని సమాచారం. వలిగొండ–బీబీనగర్ మధ్య దాదాపు ఆరు కిలోమీటర్ల మేర సీఎం పాదయాత్ర సాగనుంది.