- మూసీ వెంట నడవనున్న రేవంత్‌రెడ్డి
- యాదాద్రి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వరకు యాత్ర
- బర్త్‌డే రోజు యాదగిరిగుట్టలో కుటుంబ సమేతంగా పూజలు
- మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ
హైదరాబాద్ / యాదాద్రి, వెలుగు: మూసీ కాలుష్యం, పునరుజ్జీవంపై ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు తన పుట్టిన రోజైన నవంబర్ 8ని ఎంచుకున్నారు. బర్త్ డే రోజు సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ, జిల్లా అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు.
మిషన్ భగీరథలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి రూ. 210 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు.దీనికి సంబంధించిన పైలాన్‌ను యాదగిరిగుట్టలో ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ‘మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర’ పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు ఈ పాదయాత్ర సాగేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
మంగళవారం ఉదయం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు సీఎంను కలిసి పాదయాత్రపై చర్చించనున్నట్టు సమాచారం. మూసీ పునరుజ్జీవం ఎంత ఆవశ్యకమో చెప్పేందుకు వాడపల్లి నుంచి తానుపాదయాత్ర చేస్తానని, నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా? లేదా? అని వారినే అడిగి తెలుసుకునేందుకు తనతో కలిసి కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ నడుస్తారా? అని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే.