పెండింగ్‌‌‌‌ కేసులతో న్యాయవ్యవస్థకు సవాల్​ : సీఎం రేవంత్ రెడ్డి

  • కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరం: రేవంత్‌‌‌‌ రెడ్డి 
  • మధ్యవర్తిత్వం, చర్చలతో వేగంగా వివాదాలు పరిష్కరించొచ్చు
  • కామన్ వెల్త్ మెడ్ - ఆర్బ్ కాన్ఫరెన్స్ 2024లో సీఎం 

హైదరాబాద్, వెలుగు: న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని.. అయితే భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌‌‌‌లో ఉండడం కోర్టులకు సవాల్‌‌‌‌గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెండింగ్ భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో కామన్ వెల్త్ మెడ్- ఆర్బ్ కాన్ఫరెన్స్-–2024 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు.

మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకూ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌‌‌‌ (ఐఏఎంసీ)‌‌‌‌ నిర్వాహకులను సీఎం అభినందించారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌‌‌‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలైనంత వేగంగా పరిష్కరించొచ్చని తెలిపారు. ఐఏఎంసీ అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని.. దేశం మొత్తానికి ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఉపయోగపడుతుందని చెప్పారు.

ఐఏఎంసీని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌‌‌‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే దీనిని పరిమితం చేయొద్దని సూచించారు. కామన్‌‌‌‌ మ్యాన్‌‌‌‌కు, చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌‌‌‌లో హైదరాబాద్ నగరం ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సునిర్వహించాలని సీఎం కోరారు.