హాస్టల్​ స్టూడెంట్స్​కు నాసిరకం భోజనంపెడితే జైలుకే : సీఎం రేవంత్​

హాస్టల్​ స్టూడెంట్స్​కు నాసిరకం భోజనంపెడితే జైలుకే : సీఎం రేవంత్​
  • గ్రీన్​ చానల్​ ద్వారా మెస్, కాస్మోటిక్​ చార్జీలు
  • త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తం 
  • సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి 
  • ఏ ఒక్క స్కీమ్​ తొలగించం.. ఎవ్వరి రిజర్వేషన్లు లాక్కోం 
  • సర్వేపై  అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు
  • ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్​ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం

హైదరాబాద్,వెలుగు: గురుకుల హాస్టల్​ స్టూడెంట్స్​కు నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘‘రాష్ట్రంలోని స్కూళ్లు, గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు పెట్టే అన్నం, కూరలు నాసిరకంగా ఉన్నాయి. దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటున్నది. కలుషిత ఆహారం తీసుకొని హాస్పిటల్స్​ పాలవుతున్నారు. అధికారులకు ఆదేశాలిస్తున్నా.. నాసిరకమైన భోజనాలు పెట్టినా, సరకులు సరఫరా చేసినా ఊచలు లెక్కించాల్సిందే. 

వారందరినీ కటకటాల వెనక్కు పంపాల్సిందే’’ అని వార్నింగ్​ ఇచ్చారు. రాష్ట్రంలో గత పదేండ్ల నుంచి డైట్ చార్జీలు పెంచలేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఆలోచనతో తాము ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలపై 40శాతం పెంచినట్టు గుర్తుచేశారు. కాస్మోటిక్ చార్జీలనూ పెంచామని చెప్పారు. అవసరమైతే కాంట్రాక్టర్లు, ఇతర బిల్లులు అపి అయినా పేద పిల్లలకు అందించే డైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రతినెలా మొదటివారంలోనే గ్రీన్ చానల్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. 

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తింటున్న సన్న బియ్యాన్నే గురుకులాల్లోని పిల్లలకు పెడుతున్నామని చెప్పారు. గురుకులాలను తక్కువగా అంచనా వేయొద్దని, అక్కడ చదువుతున్న వారిలో చాలామంది ఐఏఎస్​లు, ఐపీఎస్​లు, రాజకీయ నాయకులు అయ్యారని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్​లోని ఎల్​బీ  స్టేడియంలో నిర్వహించిన చిల్డ్రన్స్​డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గత డిసెంబర్ 7న ఇదే ఎల్​బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు.  

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా  నవంబర్ 14  నుంచి డిసెంబర్ 9 వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న బాలల దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎడ్యుకేషన్​లో అనేక రెవల్యూషన్స్​ తీసుకొచ్చారని చెప్పారు. అందరికీ విద్యను అందుబాటులో తెచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. ఉచిత నిర్బంధ విద్య ద్వారా పేదలకు విద్యను అందించేందుకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ కృషి చేశారని గుర్తుచేశారు. 

పదేండ్లలో 5 వేల స్కూళ్లు మూతపడ్డయ్​

గత బీఆర్ఎస్​ సర్కారు పట్టించుకోకపోవడంతో పదేండ్లలో 5 వేల స్కూళ్లు మూతపడ్డాయని, దీంతో ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకు దూరమయ్యారని సీఎం రేవంత్​ చెప్పారు. అందుకే విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్నానని,  ఈ సారి బడ్జెట్​లో  రూ. 21 వేల కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. బడ్జెట్‌‌లో 7 శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించినట్టు చెప్పారు.

 రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మంది టీచర్లకు బదిలీలు నిర్వహించి, 21 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని వివరించారు. గత పదేండ్లలో ఒకే ఒక్కసారి డీఎస్సీ వేశారని, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే 11 వేలతో డీఎస్సీ నిర్వహించి, టీచర్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. బడుల్లో స్కావెంజర్లు , అటెండర్లను నియమించాలని, వారి కోసం 150 కోట్లు సింగరేణి ద్వారా సేకరించినట్టు వెల్లడించారు. వర్సిటీల్లో వీసీల నియామకం సరిగా జరగక, సిబ్బందిని నియమించకపోవడంతో వాటి ప్రతిష్ట దిగజారిందన్నారు. 

కాంగ్రెస్ సర్కారు రాగానే 10 వర్సిటీలకు వీసీలను నియమించామని, త్వరలోనే వర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులనూ భర్తీ చేయబోతున్నట్టు వెల్లడించారు. విద్యపై పెట్టేది ఖర్చు కాదని, దేశ పునర్నిర్మాణం కోసం పెట్టే పెట్టుబడి అని చెప్పారు. విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. 

 రాష్ట్రంలో  26,854 సర్కారు విద్యాసంస్థల్లో 26 లక్షల మంది చదువుతుండగా,  11 వేలకు పైగా ఉన్న ప్రైవేటు బడుల్లో 36 వేల మంది విద్యనభ్యసిస్తున్నారని వివరించారు. సర్కారు బడుల ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వెల్లడించారు. ప్రైవేటు స్కూళ్ల కంటే సర్కారు బడులు మేలు అనే భరోసా పేరెంట్స్ లో కల్పించాలని టీచర్లకు సూచించారు. వారంలో కనీసం రెండు ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలను పరిశీలించాలని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇప్పటికే సూచన చేసినట్టు చెప్పారు. వెళ్లని అధికారుల ప్రమోషన్లపై ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరించారు. 

ఎమ్మెల్యే అర్హత వయస్సు తగ్గించాలి 

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రస్తుతం 25 ఏండ్లు అర్హత వయస్సుగా ఉన్నదని, దాన్ని 21 ఏండ్లకు తగ్గించేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అమోదించేలా కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 21 ఏండ్లకు ఐఏఎస్, ఐపీఎస్ లు అయి జిల్లాలను నడిపిస్తున్నారని, అలాంటిది ఎమ్మెల్యే అర్హత 21 ఏండ్లకు ఎందుకు ఉండకూడదని అన్నారు. 

దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని సభలో ఉన్న శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును కోరారు. అంతకు ముందు స్టేజిపై ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో అంగన్ వాడీ విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాలను సీఎం రిలీజ్ చేశారు. 

కులగణనతో ఏ స్కీమ్ రద్దు కాదు 

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలంటే కులగణన సర్వే జరగాలని, సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలని రేవంత్ చెప్పారు. రాజకీయ, ఉద్యోగ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అందేలా తాము చూస్తామని స్పష్టం చేశారు. అంతేగానీ ఎవరి ఆస్తులు లాక్కోబోమని, ఎవరి రిజర్వేషన్లు గుంజుకోబోమని వెల్లడించారు. ఇది ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తొలగించడానికి కాదని, కులగణన సర్వే మెగా హెల్త్ చెకప్ లాంటిదని వెల్లడించారు.

 ప్రజలను మభ్యపెట్టేందుకు కొందరుంటారని, పదేండ్లలో వారికి నిరుద్యోగులు, అశోక్ నగర్ చౌరస్తా గుర్తుకు రాలేదని అన్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో పిల్లలను రెచ్చగొట్టి వాళ్లు అమరులైతే.. అధికారంలోకి వచ్చి మనల్ని తొక్కేశారని చెప్పారు. పదేండ్ల తర్వాత తెలంగాణ సమాజం తేరుకొని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నదని అన్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారనీ, వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులదేనని చెప్పారు.

విద్యార్థులే తెలంగాణ భవిష్యత్​

తెలంగాణకు విద్యార్థులే భవిష్యత్​ అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  సర్కారు బడుల్లోనే చదివిన తామంతా వివిధ స్థాయిల్లో ఉన్నట్టు గుర్తుచేశారు. తెలంగాణ గురుకులాల్లో సన్నబియ్యంతో మంచి ఆహారం అందించాలని సన్న వడ్లు పండించే రైతులకు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. 2028లో జరిగే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్​ కు పెద్దపీట వేస్తున్నామని, క్రీడా ప్రాంగణాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని వెల్లడించారు.