హైదరాబాద్: ఒంటరిననే ఫీలింగ్ వచ్చినప్పుడల్లా గద్దర్ దగ్గరకు వెళ్లేవాడిని.. నీ బాధ్యత నువ్వు నెరవేర్చు.. ప్రజలే నీకు అవకావం ఇస్తారని ఆయన చెప్పేవారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గద్దర్ చెప్పినట్లే నా బాధ్యత నెరవేర్చాను.. ప్రజలు నాకు అవకాశం ఇచ్చారని అన్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ 77వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పో రాటం చేసిన గద్దర్ పేరిట అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. ఆయన పేరిట అవార్డు ఇవ్వడమంటే ప్రతియేటా ఆయనను స్మరించుకోవడమేనని అన్నారు. సమాజానికి స్ఫూర్తినిచ్చేలా గద్దర్ అవార్డు ఉండాలని భావించానని.. అందుకే గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించానని తెలిపారు. గద్దరన్న మరణించినప్పుడు ఆయన చివరిచూపు ప్రజలందరికీ దక్కాలని ఎల్బీ స్టేడియానికి తీసుకొచ్చామని.. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్టేడియం గేట్లకు తాళం వేసిందని ఫైర్ అయ్యారు. గద్దర్ చివరి శ్వాస వరకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని కొనియాడారు.
ఈ ఏడాది రాష్ట్రం నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేశాం. గద్దర్, గోరటి వెంకన్న, చుక్కా రామయ్య, అందె శ్రీ, తిరుమలరావుకి పద్మ అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదించామని తెలిపారు. కానీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురి పద్మ అవార్డులు ఇచ్చారు.. వాళ్ల కంటే మేం ప్రతిపాదించిన వాళ్లు తక్కువా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర చేసిన తప్పును సరిదిద్దుకుంటుందని లేఖ కూడా రాశా.. కానీ వాళ్లు తప్పు సరిదిద్దుకోకుండా గద్దర్‌కు అవార్డ్ ఇవ్వమని అన్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఇంకోసారి గద్దర్ గురించి తప్పు మాట్లాడితే.. సంబంధిత పార్టీ కార్యాలయం (పరోక్షంగా బీజేపీ) ఉండే ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ కొందరు నేతలు గద్దర్ ను ప్రజా భవన్ బయట నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ ను ప్రజా భవన్ బయట నిలబెట్టిన వ్యక్తులు.. ఇప్పుడు ప్రజా భవన్ బయట ఉన్నారని అన్నారు. గద్దర్ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తికి ఓట్ల విప్లవం చూపిస్తామని హెచ్చరించారు. రాహుల్ గాంధీతో మాట్లాడి గద్దర్‌కు మేమే అవార్డు ఇప్పిస్తామన్నారు.