హైదరాబాద్: 75 ఏళ్లు కష్టపడి దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పెంచితే.. ప్రధాని మోడీ, ఆయన మిత్రుడు అదానీ కలిసి దేశ పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం (డిసెంబర్ 18) ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లస్ రోడ్ నుండి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి రాజ్ భవన్ రూట్లో బైఠాయించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. వ్యాపారం చేసేందుకు బిలియనీర్ అదానీ లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.. ఈ విషయాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిలదీశారు.. కానీ ప్రధాని మోడీ దీనిపై మౌనంగా ఉంటున్నారని అన్నారు. అదానీతో ప్రధాని మోడీకి లాలూచీ ఒప్పందం ఉందని.. అందుకే అదానీ కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడించామని తెలిపారు.
Also Read :- రాజ్ భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్ రెడ్డి
మా పోరాటం ఇక్కడితో ఆగదని.. అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.. కానీ దేశ ప్రతిష్టను కాపాడుకోవడానికే రోడ్డుపై నిరసన తెలపాల్సి వచ్చిందన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నామని స్పష్టం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే మేం ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని.. ముఖ్యమంత్రి ధర్నా చేస్తారా అని బీఆర్ఎస్ అంటోంది.. నేను ధర్నా చేయను.. మరీ వాళ్లు వచ్చి చేస్తారా అని ప్రశ్నించారు. అదానీ అంశంపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.