
- దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలం లేనందునే డీలిమిటేషన్ పేరుతో కుట్ర
- జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌కు ఒప్పుకోం
- కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగవడ్తరా?
- దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాడుతాం
- కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి
- అమిత్ షా చెబుతున్నవన్నీ అబద్ధాలే
- కేసీఆర్ చేసిన అప్పులు రూ.7 లక్షల కోట్లు
- వాటి మిత్తీలకే ప్రతి నెల రూ.6,500 కోట్లు కడ్తున్నామని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చూస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎంత ప్రయత్నించినా సౌత్ ఇండియాలో బీజేపీ బలపడదని ఆ పార్టీ నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే డీలిమిటేషన్ అనే ఆయుధంతో కుట్రకు తెరలేపారు. పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి కావాల్సింది రాజకీయ లబ్ధి తప్ప.. మరొకటి కాదు. అధికారంలోకి వచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను వెతకడం ఆ పార్టీకి అలవాటే” అని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న డీలిమిటేషన్ కుట్రను గుర్తించి, ఆ అంశాన్ని లేవనెత్తానని చెప్పారు.
శుక్రవారం ఢిల్లీలో ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకుంటారా? అని మండిపడ్డారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన డీలిమి టేషన్ చేపడితే..1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సౌత్ స్టేట్స్‌కు డీలిమిటేషన్ నుంచి మరో 30 ఏండ్లు మినహాయింపు ఇవ్వాలని కోరారు.
అమిత్ షా చెప్పేవి అబద్ధాలు..
డీలిమిటేషన్‌తో నార్త్‌లోని పంజాబ్‌కు కూడా నష్టమేనని, దీన్ని ఆ రాష్ట్ర నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే పంజాబ్‌లో బీజేపీ గెలవదని, ఆ రాష్ట్రంలో సీట్లు పెరగకపోయినా ఆ పార్టీకి నష్టం లేదన్నారు. డీలిమిటేషన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అబద్దాలు చెబుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీకి నిజంగా నిజాయతీగా ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలే కాకుండా తమతో వచ్చే ఉత్తరాది రాష్ట్రాలతోనూ కలిసి పోరాటం చేస్తామని తెలిపారు.
ప్రతినెలా మిగిలేది రూ.5,500 కోట్లే
పదేండ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్.. అక్షరాలా రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘2014లో మేం తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రానికి ఉన్న అప్పు రూ.69 వేల కోట్లు. కానీ కేసీఆర్ పదేండ్ల కాలంలోనే రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్లారు. కేసీఆర్ సృష్టించిన భ్రమల్లోనే ప్రజలు ఇంకా ఉన్నారు. ఆ ప్రకారమే నేను కూడా రాష్ట్రానికి రూ.3.75 లక్షల కోట్ల అప్పు ఉందని అనుకున్నాను. వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలమని అనుకున్నాను. కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత అసలు విషయం బయటపడింది” అని చెప్పారు. ‘‘రాష్ట్రానికి ఇప్పుడు నెలకు వచ్చే ఆదాయం రూ.18,500 కోట్లు. ఇందులో జీతాలు, పింఛన్లకు నెలకు రూ.6,500 కోట్లు, అప్పుల వడ్డీలకు రూ.6,500 కోట్లు కడుతున్నాం.
మేం తిన్నా తినకపోయినా.. టీ తాగినా, తాగకపోయినా ప్రతినెల పదో తేదీ లోపు రూ.13 వేల కోట్ల చొప్పున కట్టి తీరాల్సిందే. ఇక మిగిలిన రూ.5,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం చేపట్టాలి’’ అని వివరించారు. అప్పులు, వడ్డీల సంగతి ఎలా ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీలు అమలుచేసి తీరుతామని చెప్పారు. ‘‘అప్పుల రాష్ట్రంలో గ్యారంటీలు ఎందుకిచ్చారు? అని నన్ను అడుగుతున్నారు. కానీ ప్రధాని మోదీ కూడా ఢిల్లీలో అనేక గ్యారంటీలు ఇచ్చారు. వాటిపై ఎవరూ ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదు. మోదీ గ్యారంటీలకు వ్యతిరేకమైతే ఢిల్లీలో ఎందుకు గ్యారంటీలు ఇచ్చారు” అని ప్రశ్నించారు. ఒకే దేశం–ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపైనా చర్చ జరగాలన్నారు. ‘‘మూలధన వ్యయం(క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్)పైనా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను నెలకు రూ.500 కోట్లు కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెట్టలేకపోతున్నాను. ఇట్లయితే రానున్న రోజుల్లో రాష్ట్రం, దేశం పరిస్థితి ఏం కావాలి?” అని ఆందోళన వ్యక్తం చేశారు.
అవే మా వీక్‌నెస్
మోర్ లిబరల్, మోర్ డెమోక్రటిక్‌నే కాంగ్రెస్ పార్టీ వీక్‌నెస్ అని సీఎం రేవంత్ అన్నారు. పార్టీలో ఎవరు ఏమైనా మాట్లాడొచ్చని చెప్పారు. ‘‘50 ఏండ్లు పార్టీ నుంచి లాభం పొంది ఒక్కసారి సీటు రాకపోతే జంతర్‌మంతర్‌లో ధర్నా చేయచ్చు. మరి బీజేపీలో ఇది సాధ్యమా?. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఇతర పెద్ద పెద్ద నేతల్ని పక్కన పెట్టినా.. మాట్లాడే వాళ్లు ఆ పార్టీలో ఒక్కరూ లేరు. అదే కాంగ్రెస్‌లో ఒక్కసారి పక్కన పెడితే మీడియా సంస్థలు కూడా గగ్గోలు పెడతాయి. స్పెషల్ ఇంటర్వ్యూలు మొదలు పెడతాయి” అని అన్నారు. ‘‘ప్రభుత్వం వేరు.. పార్టీలు వేరు. పార్టీలంటే పోరాడాలి.. ప్రభుత్వాలు కలిసి పని చేయాలి. నేను సీఎంగా ప్రధానమంత్రిని ఎంతో గౌరవిస్తా. పార్టీ వేదికపై పార్టీ విషయాలు మాట్లాడతా.
మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నా. కానీ ఆయనను కలిసి మా రాష్ట్రానికి కావల్సినవి అడగడం నా హక్కు, బాధ్యత.. ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించి సీఎంను చేశారు. రాష్ట్రంలో స్కిల్ యూనిర్సిటీకి గౌతం అదానీ ఆఫర్ చేసిన రూ.100 కోట్లను రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్నాను. కానీ బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించడంతోనే వెనక్కి ఇచ్చేశాం. మరి బీజేపీ అదానీ నుంచి తీసుకున్న బాండ్లను ఎందుకు వెనక్కి ఇవ్వలేదు’’ అని ప్రశ్నించారు. కుంభమేళాకు తన కుటుంబం వెళ్లిందని.. కానీ భద్రాచలం రావాలని మోదీ, అమిత్ షాను ఆహ్వానించినా రాలేదన్నారు.
ఓబీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతాం
దేశంలోని ఓబీసీలకు అన్యాయం చేసేందుకే బీజేపీ కులగణన చేపట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘గతంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీనే రిజర్వేషన్లు ఇచ్చింది. ఇప్పుడు కులగణన లెక్కలతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. మండల్ కమిషన్ ఆధారంగా 29 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. ఇప్పుడు ఆ శాతాన్ని 42 వరకు పొడిగించనున్నం. దేశ స్వాతంత్ర్యం కోసం మైనార్టీలు ప్రాణాలర్పించారు. మరి అలాంటప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎందుకు ఒక్క మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక జాతి, వర్గానికి ఏ ప్రధాని ఇంతటి అన్యాయం చేయకూడదు. రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంట వెసులుబాటు ఇవ్వడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.
తెలంగాణలో ముస్లింల ఓట్ల కోసం మేం బుజ్జగింపు రాజకీయాలు చేయడం లేదు. ప్రజల మత విశ్వాసాలను మేం గౌరవిస్తాం. దసరా, నవరాత్రి ఉత్సవాలను గౌరవిస్తున్నాం. తిరుపతి వెళ్లే భక్తులకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. దేశంలోని ప్రతి మతానికి, విశ్వసానికి గౌరవం ఇవ్వడం సమాఖ్య స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని నింపేందుకు మేం కృషి చేస్తున్నాం. 200 ఏండ్లకు పైగా పాలించిన బ్రిటిషర్లు వెళ్లిపోయిన తర్వాత ఆంగ్లో ఇండియన్లకు పార్లమెంట్, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇచ్చాం” అని అన్నారు.
హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించాలి
ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహణకు అహ్మదాబాద్‌తో పోల్చితే హైదరాబాద్ అన్ని విధాలుగా అనువైనదని సీఎం రేవంత్ అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు. ‘‘హైదరాబాద్ ఇప్పటికే మిలటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్, ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. నిఖత్ జరీన్, సానియా మీర్జా, పీవీ సింధు సహా ఒలింపిక్స్, క్రికెట్‌లో రాణించిన వారంతా తెలంగాణ నుంచి వచ్చారు. అహ్మదాబాద్ కన్నా మా దగ్గర వంద రెట్లు ఎక్కువగా వసతులు ఉన్నాయి.
మీరు నిజ నిర్ధారణ బృందాన్ని పంపండి. అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో ఏమేం వసతులు ఉన్నాయో తేల్చండి. ఒలింపిక్గేమ్స్ నిర్వహణకు హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని మేం ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలు మేలో హైదరాబాద్‌లో జరగనున్నాయని, ఈ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు ఒలింపిక్స్ ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు. అహ్మదాబాద్‌కు నరేంద్ర మోదీ బ్రాండ్ అంబాసిడర్ అయితే హైదరాబాద్‌కు బ్రాండ్ రేవంత్ రెడ్డి అని చెప్పారు.
బీజేపీది నైస్–ఐస్ నినాదం..
బీజేపీ కేవలం ‘నైస్– ఐస్’ నినాదంతో ఎన్నికలకు పోతున్నదని సీఎం రేవంత్ విమర్శించారు. ‘‘నైస్ కావాలా? ఐస్ కావాలా? అని బీజేపీ నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలకు ఫోన్ వస్తున్నది. నైస్ అంటే నార్కోటిక్స్, ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐ, ఈడీ దాడులు. ఐస్ అంటే బీజేపీ కండువా కప్పుకోవడం. ఇలా బీజేపీ మాదిరిగా ఎన్నికల్లో గెలవాలంటే నైస్ వంటి సంస్థలు ఉండాలి” అని వ్యాఖ్యానించారు.
అందుకే ఫ్యూచర్ సిటీ...
భవిష్యత్ అవసరాలకు తగిన నగరాల నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణలో వంద శాతం తెలంగాణ ముందుందని సీఎం రేవంత్ చెప్పారు. అందుకే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో అద్భుతమైన నగరం నిర్మిస్తున్నామని వెల్లడించారు. ‘‘కరోనా సమయంలో ఔషధాలు ఎక్కడ తయారయ్యాయి. మూడో వంతు ఔషధాలు మేం సరఫరా చేశాం. భారతదేశంలోని 35 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతాయి. ఐటీ గురించి మేం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అహ్మదాబాద్‌లో ఐటీ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్ ఐటీ, హైదరాబాద్ ఐటీ ఎగుమతులు చూడండి’’ అని అన్నారు.
‘‘తెలంగాణ అభివృద్ధి కులీ కుతుబ్ షాహీ కాలం నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత నిజాం, బ్రిటిష్ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి.. అలా ఆ తర్వాత ఇప్పుడు నేను. 450 ఏండ్లకు పైగా చరిత్ర తెలంగాణ, హైదరాబాద్‌కు ఉంది. చార్మినార్, గోల్కొండ కోట చంద్రబాబు కట్టారా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు కట్టారా? హైదరాబాద్‌లో ప్రముఖ కట్టడాలన్నీ 450 ఏండ్ల కిందే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు మారినా, సీఎంలు మారినా అభివృద్ధి కొనసాగింది. ప్రపంచంలోనే అత్యుత్తమైన గాజులు, ముత్యాలు చార్మినార్ వద్ద దొరుకుతాయి. ఇప్పుడు డాలర్ల మార్పిడి చేస్తున్నాం గానీ.. 400 ఏండ్ల క్రితమే అక్కడ నగదు మార్పిడి ఉంది” అని గుర్తు చేశారు.
హిందీ దేశ భాష కాదు..
హిందీ దేశ భాష కాదని, దేశంలోని ఎక్కువ మంది మాట్లాడే భాష మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. హిందీ తర్వాత తెలుగు, బెంగాలీ భాషలను ఎక్కువ మంది ప్రజలు మాట్లాడుతారని చెప్పారు. అన్ని రాష్ట్రాలపై హిందీని రుద్దాలని ప్రయత్నిస్తున్న బీజేపీ సర్కార్.. తెలుగు భాష అభివృద్ధికి ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. సివిల్స్ ఎగ్జామ్స్ నుంచి తెలుగును పూర్తిగా తొలగిం చారని మండిపడ్డారు. తమ ఎదుగుదలకు అవసరం అనుకుంటే.. ప్రజలు హిందీ, ఇంగ్లిష్ ఏ భాషలైనా నేర్చుకుంటారని చెప్పా రు. అంతేగానీ ఏదైనా భాషను నేర్చుకోవాలని వాళ్లపై ఒత్తిడి పెడితే సహించేది లేదన్నారు.
తెలంగాణది ట్వంటీ-ట్వంటీ మోడల్..
గుజరాత్‌ది అవుట్ డేటెడ్ మోడల్ అని, అది టెస్ట్ మ్యాచ్ మోడల్ అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణది ట్వంటీ–ట్వంటీ మోడల్ అని, దేశానికి నమూనా అని చెప్పుకొచ్చారు. ‘‘తెలంగాణ మోడల్‌లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన వంటి మూడు అంశాలు ఉన్నాయి. హైదరాబాద్‌తో పోటీ పడే ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్‌కు ఉన్నాయా? గుజరాత్‌లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్‌లో ఏం ఉంది? మేం అహ్మదాబాద్, ముంబై, బెంగళూర్, ఢిల్లీతో పోటీ పడడం లేదు. మేం న్యూయార్క్, సియోల్, టోక్యోతో పోటీ పడాలను కుంటున్నాం. మా తెలంగాణ నమూనాతో ఎవరూ పోటీ పడలేరు’’ అని అన్నారు.
దేశంలో ఏ మూలకు పెట్టుబడులు వచ్చినా, వాటికి ప్రధానిగా మోదీ మద్దతు ఇవ్వాలని.. కానీ ఇందుకు భిన్నంగా పెట్టుబడులను గుజరాత్‌కు తీసుకెళ్లేలా వ్యవహరించడం ఏం పద్ధతి? అని మండిపడ్డారు. ‘‘మోదీ గిఫ్ట్ సిటీ తీసుకెళ్లారు. ఎవరైనా విదేశీయుడు గిఫ్ట్ సిటీలో పెట్టుబడులు పెడితే, లాభాలు వాళ్ల దేశానికి తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు” అని ప్రశ్నించారు.