- బీజేపీ పని ఖతం.. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే
- మోదీ చెప్పిన ఏటా రెండు కోట్ల జాబ్స్ ఏడికి పోయినయ్?
- అత్యధిక నిరుద్యోగులున్న దేశంగా భారత్‌ను మార్చిండు
- హంగర్ ఇండెక్స్‌లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్
- రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు.. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి
- కేంద్ర మంత్రిగా అంబర్‌పేట బ్రిడ్జిని కూడా కిషన్‌రెడ్డి పూర్తి చేయలే
- హైదరాబాద్‌కు వరదలొస్తే అణాపైసా పేదలకు ఇప్పించలే
- బండి పోతే బండి.. గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ పత్తాలేడు
- బీఆర్ఎస్ సచ్చిన పాము .. ఆ పార్టీ గురించి మాట్లాడుడు వేస్ట్
- కేసీఆర్, ఈటల రాజేందర్ బొమ్మాబొరుసులాంటోళ్లని విమర్శ
- సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్‌సభ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం
హైదరాబాద్, వెలుగు: మోదీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగులున్న దేశంగా భారత్ మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘మోదీ గ్యారంటీలంటూ బీజేపీ ప్రచారం చేస్తున్నది. మోదీ గ్యారంటీలకు, బీజేపీకి వారంటీ అయిపోయింది. ఆ పార్టీని ఇక జనం నమ్మరు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తమని చెప్పిన మోదీ.. దేశ ప్రజలను నమ్మించి ముంచిండు. నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపెట్టిండు” అని ఆయన మండిపడ్డారు. హంగర్ ఇండెక్స్‌లోనూ ప్రపంచంలో 111 స్థానానికి దేశాన్ని మోదీ తీసుకెళ్లారని, ఈ విషయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకన్నా మెరుగ్గా ఉన్నాయని ఆయన తెలిపారు.
సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లోని అంబర్‌పేటలో, మల్కాజ్గిరి లోక్‌సభ సెగ్మెంట్లోని ఉప్పల్‌లో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌కు మోదీ ఇచ్చిందీ, కిషన్ రెడ్డి తెచ్చిందీ ఏమీలేదు. గుజరాత్‌కు బంగారు గుడ్డు ఇచ్చిన మోదీ.. తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు” అని విమర్శించారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగితే గాడిద గుడ్డు ఇచ్చిన్రు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారనుకుంటే గాడిద గుడ్డు ఇచ్చిన్రు. విభజన చట్టంలోని ఏ హామీని కూడా మోదీ నెరవేర్చలేదు. మోదీ ఏమిచ్చిండు.. గాడిదగుడ్డు ఇచ్చిండు” అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తానన్న మోదీ.. మూడింతల ఖర్చు పెంచారని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డి ఈ నగరానికి తెచ్చిందేమీ లేదు. మళ్లీ ఇప్పుడు గెలిచి ఏం ఒరగబెడతారు? కనీసం అంబర్‌పేట బ్రిడ్జిని కూడా ఆయన పూర్తి చేయలేదు” అని సీఎం విమర్శించారు. ‘‘నగరంలో వరదలు వస్తే అణా పైసా కూడా కేంద్రం నుంచి పేదలకు కిషన్‌రెడ్డి ఇప్పించలేదు. మూసీ వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇప్పిస్తానన్న అరగుండు బండి సంజయ్ పత్తా లేకుండా పోయిండు. పేదలకు ఇండ్లు ఇప్పిస్తామన్న బీజేపీ ఒక్క ఇల్లు కూడా ఇప్పించలేదు” అని ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ గురించి మాట్లాడుడే వేస్ట్
బీఆర్ఎస్ సచ్చిన పాముతో సమానమని, ఆ పార్టీ గురించి మాట్లాడడమే వేస్ట్ అని సీఎం రేవంత్ అన్నారు. ‘‘కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలైతలేవని కేసీఆర్, కేటీఆర్ అంటున్రు. కేటీఆర్..! నువ్వు ఒక ఎర్రచీర కట్టుకుని గౌలిగూడలో బస్సెక్కితే కాంగ్రెస్ ఏం చేస్తున్నదో తెలుస్తది. నిన్ను టికెట్ అడిగితే మేం ఏం చేయనట్టు, అడగకపోతే గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు” అని ఆయన అన్నారు. తండ్రీ కొడుకులిద్దరూ (కేసీఆర్, కేటీఆర్) అబద్దాలు మాట్లాడుతున్నారని, వారి మోసాలకు కాలం చెల్లిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఇప్పుడు చెల్లని రూపాయి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని, ఎంపీగా ఉన్నప్పుడు అంజన్ కుమార్‌యాదవ్ నగరాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఓఆర్ఆర్, ఫార్మాసిటీ, ఐటీ, ఎయిర్పోర్ట్, మెట్రోరైల్ వంటివన్నీ వచ్చింది నిజం కాదా? కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ విశ్వ నగరం అయింది” అని అన్నారు.
పేదలకు పది లక్షల రూపాయల ఆరోగ్య బీమాతో ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. నగరానికి తాగునీటిని అందించేందుకు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు తెచ్చింది కూడా కాంగ్రెస్‌పార్టీనేనని సీఎం అన్నారు. ఈసారి బతుకమ్మ వేడుకలు బతుకమ్మ కుంటలో నిర్వహిస్తామని ప్రకటించారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాహుల్‌గాంధీ ప్రధాని అవడం ఖాయం. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపిస్తే.. సోనియాను మెప్పించి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించే బాధ్యత కూడా నేనే తీసుకుంట” అని సీఎం తెలిపారు.
బీజేపీలోకి వెళ్లి ఏం సాధించిండు
‘‘కేసీఆర్, ఈటలది పొద్దున పందెం.. చీకటి పూట ఒప్పందం. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి పోయి రెండేండ్లు అయింది. మరి బీజేపీలోకి పోయి మాదిగ సోదరుల వర్గీకరణ కోసమో, ముదిరాజ్‌ల కోసమో ఏమన్నా చేసిండా? అంగి, రంగు, వేషం, ఊరు మార్చుకొని వస్తున్న ఈటలను మల్కాజ్గిరి లోక్‌సభ నియోకవర్గ ప్రజలు గుర్తుపట్టి తగిన బుద్ధి చెప్తరు” అని ఆయన హెచ్చరించారు.
మేం ఏం చేశామని ఈటల అంటున్నడు. మరి వీళ్లు పదేండ్లు గాడిదలను కాసిండ్రా? వంద రోజుల్లో అధికారం చేపట్టిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినం. 35 లక్షల మంది ఫ్రీ జర్నీ చేశారు. 40 లక్షల కుటుంబాలు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందుకుంటున్నాయి. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ అందజేస్తున్నం.
3 నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించినం” అని తెలిపారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచాలని తాము అంటుంటే.. వాటిని రద్దు చేయాలని మోదీ చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను, మల్కాజ్గిరి ఎంపీగా సునీతా మహేందర్‌రెడ్డిని, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్‌ను గెలిపించాలని ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ‘‘కంటోన్మెంట్ప్రజలకు ఇప్పుడు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకు వేసేందుకు! మల్కాజిగిరి ఎంపీగా, కంటోన్మెంట్ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ను గెలిపించండి” అని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్, ఈటల.. ఇద్దరూ ఒకటే
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బొమ్మ బొరుసులాంటోళ్లని, ఇద్దరూ ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పంపకాల దగ్గర పంచాయితీలు వచ్చి విడిపోయారని విమర్శించారు. ‘‘కేసీఆర్, ఈటల కలిసి పదేండ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు. . కేసీఆర్ కుంటుంబం లక్షలకోట్ల దోపిడీకి పాల్పడిందంటే వారికి సద్దులు మోసింది ఈటల రాజేందరే. కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్నడంటే అప్పట్లో రాష్ట్ర ఆర్థికమంత్రిగా ఉన్న ఈటలనే కదా? కరోనా సమయలో పేదలకు మాస్క్ లు, వ్యాక్సిన్లు ఇవ్వాలంటే కంపెనీ సీఎస్ఆర్ నిధుల కోసం సంతోష్‌రావు బెదిరించి వందల కోట్లు కొల్లగొడుతుంటే ఈటల కదా సంతకం పెట్టింది’’ అని మండిపడ్డారు. ధరణి ముసుగులో ఓఆర్ఆర్ చుట్టు వేలాది ఎకరాలను దొరలు ఆక్రమించుకున్నారంటే.. వారికి కాపలా కాసింది కూడా ఈటల రాజేందరేనని అన్నారు.
కేటీఆర్, ఈటల రాజేందర్ ఒకరినొకరు ఎప్పుడూ విమర్శించుకోరు. జన్ వాడలో కేటీఆర్ 25 ఎకరాల్లో వెయ్యి కోట్లతో ఫామ్‌హౌస్ కట్టుకున్నా, గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో కేసీఆర్ కు ఫామ్‌హౌస్ ఉన్నా వారి అవినీతిపై ఎప్పుడైనా మోదీకి ఈటల ఫిర్యాదు చేసిండా?” అని నిలదీశారు. గద్దరన్న ను ప్రగతిభవన్ వద్ద ఎండలో నిలబెట్టి టైమ్ ఇవ్వకపోతే ఎప్పుడన్నా కేసీఆర్‌ను ఈటల ప్రశ్నించారా? అని మండిపడ్డారు.