న్యూఢిల్లీ, వెలుగు: ప్రత్యేక తెలంగాణ కల సాకారంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో, పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ కోసం బలంగా గళం వినిపించారని కొనియాడారు. గురువారం ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో గల సీఎం అధికారిక నివాసంలో జైపాల్ రెడ్డి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సాధారణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన జైపాల్ రెడ్డి ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడి పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, బెల్లంపల్లి, పరిగి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, విద్యాసాగర్ పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో జైపాల్ రెడ్డి జయంతి
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 83వ జయంతి వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.. జైపాల్ రెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన శైలిలో చక్రం తిప్పారని గుర్తుచేశారు. కేంద్ర మంత్రిగా హైదరాబాద్ మెట్రో రైలుకు అనుమతులివ్వడం, నిధుల కేటాయింపులో ముఖ్య భూమిక పోషించారని స్పష్టం చేశారు.