
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ క్రైస్తవుల మార్గదర్శి, రోమన్ క్యాథలిక్‌ల మత గురువైన పోప్ ఫ్రాన్సిస్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోప్ అనుచరులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రేమ, కరుణ మార్గాలను బోధిస్తూ, పేదల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, శాంతి స్థాపన కోసం పోప్ ఫ్రాన్సిస్ చేసిన కృషి అసాధారణమని, స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు.
అర్జెంటీనాలో సామాన్య కుటుంబంలో జన్మించి, పోప్ స్థాయికి ఎదిగిన ఆయన, తన నిరాడంబర జీవనశైలితో, ప్రజలకు చేరువై, పోప్ స్థానాన్ని సామాన్యులకు మరింత చేరువ చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. ఆయన బోధనలు, సేవలు రాబోయే తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో క్రైస్తవ సమాజానికి అండగా నిలుస్తున్నామని భరోసా ఇచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.