
- రాజ్యాంగ నిర్మాత భావితరాలకు స్ఫూర్తి: రేవంత్ రెడ్డి
- అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం నివాళులు
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు ఆయన కృషిచేశారన్నారు. దూరదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆదివారం ఓ ప్రకటనలో స్మరించుకున్నారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాల సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది రాజ్యాంగమేనని గుర్తుచేశారు.
బాబా సాహెబ్ స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనల నుంచి పొందిన ప్రేరణతోనే తన ప్రజా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధిఅందిస్తున్నామన్నారు.