![దేవేందర్ గౌడ్ పాదయాత్రతోనే ప్రాణహిత ప్రాజెక్టు](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-praises-devender-gouds-courage-and-conviction-for-telangana_WNsD4k2Opa.jpg)
- ఆయన తెలంగాణ కోసం తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టారు: సీఎం రేవంత్ రెడ్డి
- దేవేందర్ గౌడ్ రాసిన ‘విజయ తెలంగాణ’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్, వెలుగు: రాజకీయాల్లో విలువలు అవసరమని, అప్పుడే చిరస్థాయిలో నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఎంతో కొట్లాడారని చెప్పారు. ‘‘తెలంగాణ కోసం దేవేందర్ గౌడ్ ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. ఆనాడు ఆయన ఉన్న పార్టీలో ఆ పార్టీ అధినాయకుడికి సమానంగా దేవేందర్ గౌడ్ చలామణి అయ్యారు. కానీ తెలంగాణ కోసం తన రాజకీయ జీవితాన్నే ఆయన పణంగా పెట్టారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు.
గోదావరి జలాలు తెలంగాణలో పారించేందుకు ఉద్యమం చేపట్టారు. దేవేందర్ గౌడ్ పాదయాత్ర వల్లే ఆనాటి ప్రభుత్వం ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టింది” అని తెలిపారు. దేవేందర్ గౌడ్ రాసిన ‘విజయ తెలంగాణ’ పుస్తకాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఉద్యమంపై లోతుగా చర్చ జరగాలి. ఉద్యమ చరిత్రపై సమగ్రమైన పుస్తకాలు రావాలి. తెలంగాణ ఉద్యమమంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ అనేలా చరిత్రను కొందరు వక్రీకరించారు.
కానీ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల కోణంలో చెప్తూ విజయ తెలంగాణ పుస్తకం రాశారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకుల త్యాగాలను చరిత్రలో లిఖించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
‘‘ఉద్యమం టైమ్ లో దేవేందర్ గౌడ్ తన గుండెల మీద టీజీ రాసుకున్నారు. ప్రజలంతా తమ బండ్లు, బోర్డులు టీజీ రాసుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీ కాకుండా టీఎస్ అని పెట్టింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్‌ను టీజీగా మార్చాం. టీఎస్‌ను టీజీగా మార్చాలని అనుకున్నప్పుడు దేవేందర్ గౌడే గుర్తొచ్చారు” అని చెప్పారు. తెలంగాణ కోసం సర్వసం త్యాగం చేసిన 9 మంది ఉద్యమకారులకు ఇంటి స్థలం, రూ.కోటి ఇచ్చామని తెలిపారు.
చరిత్రను తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయాలి: దేవేందర్ గౌడ్
తెలంగాణ ప్రజలకు ఏదీ ఫ్రీగా రాలేదని, ప్రతిదీ పోరాడే తెచ్చుకున్నారని.. అందుకే తాను రాసిన పుస్తకానికి ‘విజయ తెలంగాణ’ అని పేరు పెట్టానని దేవేందర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ పోరాట గడ్డ అని, అన్నింటిలోనూ విజయం సాధించిందన్నారు. ‘‘తెలంగాణ చరిత్ర భవిష్యత్తరాలకు తెలిసేలా లండన్ తరహాలో మ్యూజియం ఏర్పాటు చేయాలి. దానికి స్వతంత్ర హోదా కల్పించాలి. మళ్లీ ఎవరైనా స్వార్థపరులు వచ్చి చరిత్రను మార్చకుండా చర్యలు తీసుకోవాలి” అని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, సలహాదారు కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.