మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు..సోలార్ ప్లాంట్స్​తో ప్రోత్సాహం: సీఎం రేవంత్​

మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు..సోలార్ ప్లాంట్స్​తో ప్రోత్సాహం: సీఎం రేవంత్​
  •     స్కూల్స్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతలు అప్పగిస్తాం
  •     ఈ నెల 12న ఎల్బీ స్టేడియంలో లక్ష మందితో సభ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన కండ్లకోయలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం  మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు.  సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వడంతోపాటు స్కూల్ డ్రెస్ లు  కుట్టే అవకాశం కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామని చెప్పారు. 

అన్ని విద్యుత్ సబ్ స్టేషన్లలో స్థానికంగా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే  కరెంట్​ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దానివల్ల మహిళా సంఘాల సభ్యులకు ఆదాయం వస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరుతోనే ఇస్తామని వెల్లడించారు.  ‘గత పదేండ్లలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు లక్షాధికారులే. ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలను కోటిశ్వరులుగా చేస్తాం.  మాపై ఆడపడుచుల దీవెన ఉండాలె’ అని సీఎం రేవంత్​ అన్నారు. 

సమాజానికి మహిళా శక్తిని చాటుదాం

స్వయం సహాయక సంఘం లోన్ ద్వారా తాను 2014లో ఒక బర్రెని కొనుగోలు చేసి పాలు విక్రయించానని, ప్రస్తుతం 25 బర్రెలతో డెయిరీ నడుపుతున్నానని, డెయిరీ ద్వారా 60  లీటర్ల పాలను విజయ డెయిరీకి పోస్తున్నామని ఓ మహిళ రేవంత్​కు చెప్పారు. అయితే, విజయ డెయిరీ నుంచి బోనస్​ రావడం లేదని ఆమె సీఎం దృష్టికి తీసుకురాగా, ఏప్రిల్ నుంచి బోనస్ అందించాలని అధికారులను ఆదేశించారు.  

తాను స్నాక్స్ ​వ్యాపారం చేస్తూ నెలకు రూ.2.50లక్షలు సంపాదిస్తున్నానని ఓ మహిళ సీఎం రేవంత్​కు తెలుపగా.. ఆమెను సీఎం అభినందించారు. ఈ నెల 12న సాయంత్రం సికింద్రాబాద్​ పరేడ్ గ్రౌండ్ లో లక్ష మంది మహిళలతో కార్యక్రమం నిర్వహిస్తామని, సమాజానికి మహిళా శక్తిని చాటుదామని పిలుపునిచ్చారు.  అనంతరం స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.306.12  కోట్ల  బ్యాంకు లింకేజీ చెక్కును రేవంత్​ అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,  మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,  ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.